3742* వ రోజు .........           12-Feb-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

విశేషాలతో గూడిన విశిష్ట శ్రమదానం - @3742*

               ఫిబ్రవరి 12, 2026-గురువారం-మహాశివునికి ప్రీతిపాత్రమైన శివరాత్రికి 2 రోజుల ముందు, శివరామపురం-కోళ్ల ఫారాల మధ్య జరిగిన 60 పని గంటల శ్రమలోని విశేషాలు చెప్పుకోవలసి వస్తే....

               అందులో తొలి విశేషం అసలైన శివరామపురం నుండి ఒక్కరూ పాల్గొనకపోవడమే!

హీనపక్షంగా 3 గ్రామాలకు-చల్లపల్లి, రామానగర, వెంకటాపురాలకు చెందిన 35 మంది చేసిన రహదారి కాలుష్య పోరాటం మరోక విశేషం!

               మీరు ఫొటోల్లో చూస్తే ఆ కార్యకర్తల పనులు సులభమైనవో-సుకుమారమైనవో-ఫోటోలకు ఫోజులిచ్చుచున్నవో అనిపిస్తవేమో గాని, అవి బరువైన-కఠినమైన-ఈ కాలంలో చాలమంది అగౌరవంగా లెక్క కట్టే మురికి-కరకు పనులు కావడం 3 వ విశేషం!

               పన్నెండేళ్ళ శ్రమదానం తర్వాత కూడ-గ్రామస్తులు పూర్తిగా మారక-నిన్న మొన్న బాగుచేసిన చోట మళ్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పడుతున్నా స్వచ్ఛ కార్యకర్తలు సహనం కోల్పోక 2 వ-3 వ మార్లు శుభ్రపరచడం విశేషం కాదూ?

               రహదార్లను కోళ్లఫారాల వారూ, ఊరి వీధి మార్జిన్లను ఇళ్ల వారూ ఆక్రమించి, కారు షెడ్లనూ, గొడ్ల పాకలనూ, పెంట కుప్పలనూ వేయడమూ, వాటిని పదేపదే కార్యకర్తలు శుభ్రపరచడమూ ఏమనుకోవాలి?

               ఇలాంటి కారణాలు లేకుంటే-కార్యకర్తల శ్రమదానం ప్రాత శివరామపురమే కాదు-వెంకటాపురం దాటిపోయేది కదూ?

               ప్లాస్టిక్ లను ఏరడమూ, బాటను ఊడవడమూ, వీధినాక్రమించిన చెట్ల కొమ్మల ఖండనమూ, ముళ్ళకంపలు సర్దడమూ, ట్రక్కు నిండా వ్యర్ధాల లోడును శివరామపురం చెత్త కేంద్రానికి చేర్చడమూ, గడ్డి చెక్కడమూ వంటి రహదారి సేవలు ముగించి,

               6:45 సమయాన మాలెంపాటి అంజయ్య గారి ఖంగుమనే నినాదాలతో గొంతు కలపడమూ,

               చివరగా రేపటి బాధ్యతల కోసం శివరామపురం దగ్గర కలవాలని-నిర్ణయించడమూ... ఇవన్నీ షరామామూలుగానే జరిగాయి!

               నిన్నటి చినజీయర్ స్వాముల పర్యటనలో వెలసిన ప్లెక్సీల,

               దివంగత వసుమతి గారి కుమార్తెల 25000/-,

               నేటి దేసు మాధురి గారి 1000/-,

               కోడూరు బాబాయి గారి 520/- రూకల చందాలు కాక -

               శ్మశానంలో బోరు పంపు నమిత్తం వూడత్తు రామారావు గారి కుటుంబీకుల 30,000/- భూరి విరాళము కూడ DRK గారి మాటల వల్ల తెలిసింది!

               కష్టమక్కరకొచ్చినట్లే!

మూడువేలా ఏడు వందల నాళ్ళ శ్రమ హద్దుగా ఇక ఈ

స్వచ్ఛ సుందర చల్లపల్లికి గడ్డు రోజులు దాటినట్లే!

MTM రహదారి భాగం హరిత వనమై పోయినట్లే!

నెలల తరబడి కార్యకర్తల కష్టమక్కరకొచ్చినట్లే!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

 

   12.02.2026