పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
3743* వ శ్రమ సందడి శివరామపురం మునివాకిట్లో!
ఈ గురువారం (13.2.26) వేకువ 39 మంది కార్యకర్తల రహదారి పరిశుభ్రతలు వివరించే ముందుగా స్థానిక-దేశ-విదేశ ‘జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం’ వాట్సప్ చదువరులకు కొన్ని ప్రశ్నలూ, సమాధాన అవకాశాలు :
1. ఈ అపరిమిత స్వచ్ఛ-సుందరోద్యమకారులు ఇంతటి శీతల కాలంలోనూ మూడింటికో, మరికాస్త ముందుగానో ఎందుకులేస్తారు?
A. తిన్నదరగక
B. వ్యసనంగా మారిన పన్నెండేళ్ల సామాజిక బాధ్యతల వలన
2) ఇళ్లకు నాలుగేసి కిలోమీటర్ల దూరంగా-శివరామపురం వద్దకు 4.30 కు వెళ్ళవలసి ఉండగా-మరీ 4:00-4.10 కే ఎందుకు వెళ్లెదరు?
A. ఆలస్యం కాకూడదనే అతి జాగ్రత్త వలన,
B. బడాయి వలన
3) మట్టి-మురికి-పేడ పనుల కోసం మహిళా, పురుష కార్యకర్తలు నేను-నేనని పోటీపడనేల?
A. ప్రజల మెప్పు కోసం
B. దీర్ఘకాల అనుభవం-అభ్యాసం వల్ల.
4 ) తమ వీధినో..ఊరినే కాక ఇన్ని పొరుగూళ్ల, రహదార్ల సేవలకారణంబేమి?
A. మీడియా దృష్టిలో పడి, పేరు ప్రఖ్యాతుల కోసం.
B. సుదీర్ఘ కాలపు సుందరీకరణ కాంక్ష శ్రుతిమించడం వల్ల,
C. ఇతర కారణమేదైనా ఉన్నచో...
5) పన్నెండేళ్ల శ్రమదానోద్యమంలో ఇన్ని సామాజిక కుటుంబ నేపధ్యాల వాళ్లు ఏ గొడవలూ పడక-ఇంత సమైక్యంగా-ప్రతిఫలాపేక్షారహితంగా ఈ ODF లూ, రహదార్ల-శ్మశానాల శుభ్ర-సౌందర్యాలెలా సాధించారట?
A. కొన్ని మానవ విలువలు పాటిస్తూ తమ బాధ్యతలు నెరవేరుస్తున్న సంతృప్తి వలన
B. తమ సామాజిక బాధ్యతల స్పృహ కారణంగా
C. కేవలం DRK డాక్టరు గారి ప్రేరణ వల్ల
ఈ సమాధానాల్లో ఏవి మీకు నచ్చాయో సరిచూసుకొనుడు!
ఇక ఈ వేకువ 4:20-6:20 సమయాల మధ్య జరిగిన శ్రమ విషయానికొస్తే:
- ఎట్టకేలకు ఈ సామూహిక శ్రమదానం ప్రాత శివరామపురంలో ప్రవేశించింది.
- బాట ఊడ్పులతో బాటు-తూర్పు-పడమర డ్రైన్ల మొండి తాళ్ల ఎండు తాటాకులు తెగి పడి, అందంగా గుట్టలుగా అమరి,
- రహదారి వైశాల్యం పదేసి అడుగులు పెరిగి, గలీజులు తొలగి ట్రాక్టరెక్కి శివరామపురం డంపింగుకు తరలి.
- ఒక భోగాది వాసు, అన్నపూర్ణమ్మల కష్టం ఫలించి-రోడ్డు 20 అడుగుల బరంతు ఏర్పడి,
- వృద్ధ కార్యకర్తలద్వయం అందరికీ చాక్లెట్లు పంచి,
- BSNL నరసింహుల వారు లయబద్ధంగా ముమ్మారు నినాదాలు పఠించి,
DRK గారు తన సమీక్షలో జీయరు గారికి వ్రాసిన లేఖను వినిపించి,
రేపటి మొక్కలు నాటే పనులకు శివరామపురంలోనే కలవాని నిశ్చయించారు!
చేతులన్నీ బొబ్బలెక్కగ
“చల్లపల్లి-వెంకటాపుర బాట సుందర హరితమయముగ
మారినట్టి” దృశ్యమెదురుగ మనకు సాక్షాత్కారమందగ
చలికి వణకీ - ఎండకెండీ చెమట చుక్కలు కార్చి కార్చీ
చేతులన్నీ బొబ్బలెక్కగ చేసిన శ్రమ ఫలించిందా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
13.02.2026