పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
శివరాత్రి ముందు నాటి శివరామపుర గ్రామ సుందరీకరణం @3744*
శనివారం (14-2-26) నాటి వేకువ సమయాన, ఆ ఉభయ శివరామపురాల పరిశుభ్ర సుందరీకర్తలు 44 మందిలో సగం మంది తీవ్రమగు చలిలో నిర్ణీత కాలానికి ముందే 1 వ శివరావుపురంలో మంచు వల్ల సరిగా కనిపించకున్నారు చూశారా?
మిగిలిన వారిలో కొందరు కనపడక దారి తప్పిన వాళ్లూ, ఇద్దరు పెద్దలైతే మరీ ఆలస్యంగా చేరుకున్నవాళ్లూ ! రహదారి ప్రయాణమే అంత కష్టమైతే ఇక గ్రామ పరిసరాల బాట భద్రత, డ్రైన్ల శుభ్రత, చెట్లు కొమ్మల అందగిపుల మాటేమిటి?
చూసేమనకైతే ఆ కార్యకర్తలూ, వాళ్లు చేస్తున్న శ్రమ దృశ్యాలు మంచు వల్ల సరిగా కనిపించవుగాని, వారి తల దీపాలు మినుకుమినుకుమంటున్నవి గమనించండి.
నేటి చల్లపల్లి, రామానగర, శివరామ - వెంకటాపురాల కార్యకర్తలు చేసిన రహదారి శ్రమదానం 3 విధాలుగా, 3 చోట్ల సాగింది.
1. ఊరి వెలుపల ఆరేడుగురు సుందరీకర్తలు సమీపంలోని మట్టి దిబ్బను త్రవ్వి, బాట అంచుల పల్లాలను పూడ్చి, వాహనాల భద్రతకు పాటుబడ్డారు.
2. గ్రామ ప్రవేశం వద్ద 10 మంది అడ్డదిడ్డంగా పెరిగిన రకరకాల చెట్ల కొమ్మల్ని కత్తిరించి, తాడి చెట్ల మట్టల్ని ఊడ బెరికి, డ్రైన్ల శుభ్రానికీ, రోడ్డు వైశాల్యానికీ ప్రయత్నించారు.
మురుగు కాల్వ వంతెన ప్రాంతంలో 12 మంది చేసిన కృషీ తక్కువకాదు.
3. చల్లపల్లి సర్పంచి, మోపిదేవి పంచాయతి కార్యదర్శీ మరికొందరూ ఇక్కడికి చాల దూరంగా - వెంకటాపురం అనధికార డంపింగ్ వద్ద 20 కి పైగా పండ్ల, పూల మొక్కలు నాటి, 6.35 తర్వాత తిరిగి వచ్చారు. అప్పుడు గాని, DRK గారి విజిలు మ్రోగలేదు!
అది సరే – చాల మంది ప్రజలు శివరాత్రి పండగ మూడ్ లోఉండగా-తగుదుమమ్మా అంటూ ఐదేసి కిలో మీటర్ల దూరాన తమది కాని ఊరి సేవలేమిటి? అంటే- శివరాత్రేకాదు- సంవత్సరంలో అన్ని రోజులూ స్వచ్ఛ కార్యకర్తలకు పండుగలే!
నేటి నినాదాల వంతు స్థానిక కార్యకర్త మల్లంపాటి ప్రేమానందునిది.
మూడు వారాలకు పైగా కార్యకర్తల కష్టంతో అందంగా తయారైన ఈ రహదారి మీద వేలాది భక్తులు కళ్లేపల్లికి ప్రయాణిస్తుంటే,
మహా శివుని ప్రసాదాల పంపకం స్వచ్ఛ కార్యకర్తలందుకొంటుంటే, ఏ 50-60 మంది స్వచ్చ కార్యకర్తల పని సందడినో వెంకటాపురం వద్ద రేపు చూసి తీరాల్సిందే!
ఏదనర్హం వీళ్ళ సేవకు?
రామనగరమొ-చల్లపల్లో వెంకటా-శివరామపురములొ
యార్లగడ్డో-పురిటిగడ్డో.... ఏదనర్హం వీళ్ళ సేవకు?
మనసు కలిగితె మార్గముండును కాయకష్టమె పెట్టుబడిగా
స్వచ్ఛ సుందర కార్యకర్తలు చక్కదిద్దిరి కొన్ని ఊళ్లను!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
14.02.2026