3745* వ రోజు .........           15-Feb-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

69 మంది వీధి శుభ్రతలు వెంకటాపురంలో!@ 3745*

ఒక ప్రక్కన వెంకటాపురం గుడి మలుపుల వద్దా, పెద్ద వంతెన దాకా శివరామపురం రోడ్డు నిండా స్వచ్ఛ కార్యకర్తల సేవల సందడి, మరోవంక ప్రవాహం లాగా పెదకళ్లేపల్లి- మహా శివరాత్రి పెను పండుగ ప్రయాణాల హడావిడి!  

వీటితో బాటు ఊరి సెంటర్ టీ - టిఫిన్ దుకాణాల వద్ద గ్రామస్తుల ప్రయాణీకుల సందోహం! వెరసి అక్కడొక వినూత్న విచిత్ర వాతావరణం!

నేటి (ఆదివారం - 15.2.26) వేకువ మొత్తం కార్యకర్తల్లో 40 శాతం మంది స్వచ్చ కార్యకర్తలుగా మారిన వెంకటాపురపు కూలీలే!  చల్లపల్లి, రామానగరం, ఉభయ శివరామపురాల వాళ్లు తక్కిన శ్రమదాతలు! నాలుగో ఐదో కిలో మీటర్లు భారీ మంచులో దారి వెత్తుక్కుంటూ వచ్చిన వాళ్లు!

సరే- చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమకారులైతే 12 ఏళ్లుగా గ్రామ సపర్యలలో రాటు తేలిపోయారనుకోండి. మరి ఇందరు వెంకటా - శివరామపురాల వారికి ఈ వేకువ కటిక చలిలో శ్రమదాన జాడ్యమంటు కొనడమేమిటి?  2 గంటల పాటు కళ్లేపల్లి శివరాత్రి పండుగకు దీటుగా ఈ సామాజిక శ్రమదాన పండుగ ఎలా సాధ్యపడుతున్నది? చాలమంది కలికాలం - పాడు రోజులు అని నిందించే ఈ రోజుల్లో కూడా ఒక సంత్సంకల్ప దృఢ నిశ్చయానికి- ఒక సామాజిక సత్కార్యానికి ప్రజల సహకారముంటుందని ఈ సంఘటన ఋజువు చేస్తున్నదా!

రెక్కాడితేనే డొక్కాడే మహిళా కూలీలు 50-60 గజాల వీధిని గడ్డి తొలగించి, వ్యర్థాలను ఊడ్చిన బాధ్యతను చూశాను!

గుడి లోపల ఎలాగున్నా- రెండు బయటి వీధుల్ని పాతిక మంది శ్రద్ధగా – బాగు చేస్తుంటే ముచ్చటేసింది!

కొందరైనా భక్తులు కూడా పాల్గొని ఉంటే గుడి ప్రహరీ లోపల కూడా ఇలాగే శుభ్ర పడి ఉండేది కదా!

 పెద్ద వంతెన వద్ద మంచులో తడుస్తూ - ఏడెనిమిది మంది పట్టిపట్టి శుభ్రపరుస్తుంటే ఆశ్చర్య పడ్డాను!

పని ముగిసిన 6.30 తరువాత ఆ 200 గజాల వీధుల్నీ, రహదారినీ ఎవరు నిదానించి చూసినా మెచ్చుకోకుండా ఉండగలరా? తమ ఊరి వీధులు బాగుపడుతున్న దృశ్యాన్ని గ్రామ సర్పంచీ, పాలక వర్గ సభ్యులూ, ముఖ్యంగా కోనేరు ఛారిటబుల్ ట్రస్టు వారూ చూస్తే ఇంకెంతగా ఆనందిస్తారో !

ఈ పండుగ నాటి సముచిత సమీక్షానందం DRK వైద్యునిది; స్వచ్చ సుందరోద్యమ నినాద ప్రకటన BDR ప్రసాదునిది;  కళ్లేపల్లి శివ నాగేశ్వర ప్రసాదంగా కార్యకర్తలకు పులిహోర పంపకం ధ్యానమండలి వారిది.

రేపటి వేకువ శ్రమదానం కళ్లేపల్లి రోడ్డులో NH 216 జంక్షన్ వద్ద అనే నిర్ణయం ఉమ్మడిది!

                  పూలబాలల సొగసు నాట్యం

తెలుసుకొనరా కార్యకర్తల దీర్ఘకాలపు కాయకష్టం?

చూడలేరా సొంత ఊళ్లో స్వచ్ఛ సుందర శుభ్ర దృశ్యం?

బైట దారుల-శ్మశానమ్ముల పూలబాలల సొగసు నాట్యం?

ఇపుడు కూడా కార్యకర్తల కెందుకయ్యా సహకరించరు?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   15.02.2026