3746* వ రోజు ............           16-Feb-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

ప్రాంతం మారింది గాని, మళ్లీ అదే శివరాంపురం రోడ్డులో! - @3746*

               సోమవారమూ, పండుగ మర్నాడూ కారణాలేమో గానీ – 16.2.26 న – NH 216, P.K. పల్లి బాటల కలయిక వద్ద - నిర్ణీత సమయానికి ముందుగా 12 గురూ, క్రమంగా మరో 12 గురూ జంక్షన్ శుభ్రతకు దిగారు. 4.20-6. 20 నడుమ శక్తివంచన లేకుండా –

               రహదారి తూర్పు పడమర భాగాల్లో ఏడేసి మంది డ్రైన్ల మరామత్తుకూ దిగారు. అక్కడి ప్లాస్టిక్, గాజు సీసాల, చిత్తు పేపర్ల, పిచ్చి మొక్కల, గడ్డి తీగలను ఏరి, ఖండించి, అదేదో వాళ్ల ఇళ్ల వరండా అన్నట్లు చతికిలబడి శుభ్రం చేశారు!

- నలుగురో-ఐదుగురో జంక్షన్ నుండి కాసానగర్ దిశగా NH 216 దక్షిణ దిక్కు రోతలను చక్కదిద్దడానికి గంట సేపు పాటుబడ్డారు!

- ఒకనాటి మద్యం షాపూ, నేటి ఫర్నిచర్ తయారీ దుకాణం వద్ద కూడా వ్యర్ధాలు తక్కువేమీ లేవు. కొబ్బరిబొండాల వ్యర్థాలూ, పెరిగిన గడ్డీ, కనిపిస్తే కార్యకర్తలు చేతులు ముడుచుక్కూర్చోరు గదా!

- రోడ్డు మీద దుమ్మూ, చెట్ల ఆకులూ, పుల్లలూ కనిపిస్తే మహిళా కార్యకర్తలు మాత్రం సహిస్తారా? వాహనాలను కాచుకొంటూ వాళ్ళ పని వాళ్లు చేసేశారు!

- ఏమాటకామాటే చెప్పుకోవాలి-ఫర్నిచర్ దుకాణం దగ్గరి లోతైన డ్రైనునూ, గట్టునూ 5 గురు ఎంత కష్టపడితే ఇప్పుడింత ముచ్చటగా తయారైందీ చూసి తీరాలి.

               6.00 దాటాక-పని విరమణ విజిల్ మ్రోగుతుందనే అనుమానంతో చకచకా జరిగిన చెత్త లోడింగు మాత్రం చిన్న పనా?

               ఆ తరవాతి సమీక్షా సమావేశాన్ని కస్తూరి విజయుడు తన నినాదాలతో ప్రారంభిస్తే-నిన్నటి కళ్లేపల్లి దగ్గరి పూజల సందర్భంలో ఎన్నెన్ని విలువైన కూరలు, పళ్లు, ఇతర ఆహారాలు వ్యర్ధాలుగా మారుతున్నదీ, వాటిని ఇక ముందైనా ఎలా సద్వినియోగించాలనేదీ డి.ఆర్.కె. గారు చర్చించారు.

               రేపు కూడ ఇదే పెదకళ్లేపల్లి రోడ్డు  హైవే జంక్షన్ వద్దనే కలవాలని కార్యకర్తల నిర్ణయం!

               సుమాలంకృత వీధులున్నవి

సుమాలంకృత వీధులున్నవి-శ్రమాలంకృత గ్రామమున్నది

బాటలన్నిటి రెండు ప్రక్కల బారులుగ వృక్షాలు ఉన్నవి

ఇంతకన్నా ఏమి కావలె నేత్రపర్వం కలుగడానికి?

ఇప్పుడైనా కార్యకర్తల కెందుకో మరి సహకరించరు?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   16.02.2026