పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
మంగళవారం(17.2 .24) కూడ పాతికమంది శ్రమదానమే!.@3747*
అందులో సగం మంది 4.30 కు కాదు- ముందుగానే! అలాగే రహదారి పనులు ముగిసింది 2 విజిళ్లు మ్రోగాక 6. 20 తరవాతనే! నిన్నటి లాగే అలనాటి మద్యం దుకాణ ప్రాంతంలోనే గాని, చల్లపల్లి వైపుగా నివాసాలకు దగ్గరలోనే ! ప్రోగుపడి, ట్రాక్టర్లో కెక్కిన వ్యర్థాలు కూడ నిండుగానే!
రహదారి గడ్డీ, పిచ్చి చెట్లూ, తీగలూ సంగతలా ఉంచి, మద్యం దుకాణం ఎప్పుడో మూత బడినా, నాలుగున్నర గోతాల గాజు, ప్లాస్టిక్ సీసాల, కప్పులు, ఇతర సింగిలీయూజ్ వ్యర్థాలక్కడికెలా వచ్చిచేరాయో ఆశ్చర్యకరమే! చల్లపల్లిలోని 3 లిక్కర్ షాపులూ, బార్ లూ, రెస్టారెంట్ల కన్నా ఈ బహిరంగ రహదారి బార్ లూ, డైనింగ్ ప్లేసులూ ఎక్కువ కావడమూ వింతే! ఇద్దరు కార్యకర్తలు ఏరి, విడగొట్టి, సంచుల్లో నింపిన సీసాలవి!
ఇక ఇప్పుడు చూడండి - శివరామపురం, NH 216 కూడలీ, అక్కడి నుండి 150 గజాల రోడ్డూ, ప్రక్కన ఖాళీ స్థలాలూ, డ్రైన్లూ ఎంత అందంగా ఉన్నవో! ఊరు సంగతలా ఉంచి, చుట్టూ ఇలాంటి రహదార్లను కదా ఏ ఊళ్ల వారైనా కోరుకోదగిందీ, నిర్వహించుకోదగిందీ?
యాదృచ్చికంగా అటూ ఇటూ వెళ్లే వాళ్ళకూ, పర్యావరణ స్పృహ తగ్గిన వాళ్లకూ సరే - ఎలాగూ ఈ రహదార్ల హరిత – శుభ్ర- సౌందర్యాలు పట్టవు, ఆ స్పృహ ఉన్నా “రహదారి బాగుందిలే” అనుకుంటారు తప్ప- దాని లోపాలూ, మెరుగుదలలూ స్వచ్ఛ కార్యకర్తలకు కనబడినంతగా వాళ్ల దృష్టికి ఆనవు.
"బాగానే ఉందిలే "అని చాలమంది భావించే ఈ 3 ½ కిలోమీటర్ల పెదకళ్లేపల్లి బాటనే కదా ఇందరు శ్రమదాతలు 4 వారాలుగా సుందరీకరిస్తున్నది?
నేటి నేటి తుది సభను నినాదాలతో ప్రారంభించినది కస్తూరి శ్రీనివాసుడైతే- జరిగిన పనుల్నీ, అందమయిన రహదారి భాగాన్నీవివరించినది Dr. DRK ఐతే-
రేపటి వేకువ కలవదగింది ఈ శివరామపురం రోడ్డులోనని నిశ్చయించింది కార్యకర్తల బృందం!
ఊరి పాపాల్ కడిగి వేయుచు
వీధిలోపాల్ చక్కదిద్దుచు- ఊరి పాపాల్ కడిగి వేయుచు
ప్రతి గజానికి మొక్క నాటుచు-హరిత సంపద వృద్ధితో రా
బోవు తరముకు మేలు చేయుచు-స్పూర్తి నింపే, మేలుకొలిపే
స్వచ్ఛ సుందర కార్యకర్తల సంస్కృతికి అభివందనం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
17.02.2026