పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
బుధవారం (18.02.2026) నాటి రహదారి బాగుచేతలు - @3748*
మళ్లీ శివరామపురం బాటలోనే, ఈరోజు కార్యకర్తల సంఖ్య – 27, అటు మొదలైన రోడ్డు సేవలు చల్లపల్లి దిశగా నివాసిత గృహాల నడుమకు వచ్చి ఆగింది. అప్పటికే నిర్ణీతకాలం అతీతమై (6.20) పోయింది.
కుడి-ఎడమ చేతి వాటాల కత్తుల వాళ్ళు డ్రైన్ల గడ్డినీ, పిచ్చి చెట్లనూ, కొన్ని చోట్ల అందంగాలేని కొమ్మల్నీ తొలగించడం కూడా ముగిసింది. డిప్పల వారు చురుకుగా కదుల్తూ వ్యర్ధాల్ని అందిస్తుంటే ట్రాక్టర్ లో నిలిచి, అందుకొని కళాత్మకంగా సర్దే పని ముగిసింది.
నిన్న దొరికినవి కాక మరో 2 ½ గోతాల మద్యం, మంచినీళ్ల సీసాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఈ ఉదయం కూడా దక్కినవి.
మరో నిముషానికి ఆకుల కార్యకర్త ప్రయోగిస్తున్న గడ్డి కోత యంత్రం ఆగింది. దంతెల, చీపుళ్ల లాగుడూ, ఊడ్పూ ముగించి స్వచ్ఛ మహిళా కార్యకర్తలు శుభ్రపడిన 100 గజాల రోడ్డును చూసి, మురిసిపోతున్నారు! కాఫీలకు చల్లపల్లి వెళ్లిన నందేటి కార్యకర్తా తిరిగి వచ్చాడు.
అందరూ ఒంటి దుమ్మూ-చెమటలు తుడుచుకొని, కడుగుకొని, స్వచ్ఛ కబుర్లాడుకొంటూ కాఫీలాస్వాదించి, నేటి తమ గ్రామబాధ్యతలు నెరవేర్చిన ఉత్సాహంలో ఉన్నారు.
ఇక-అప్పుడు నేటి శ్రమ సమీక్షా సభను ఆస్పతి ఉద్యోగిని శ్రీమతి చిట్టూరి సుమతి నినాదాలతో ప్రారంభించగా, నేటి 40 పనిగంటల కష్టాన్నీ, 4 వారాల శ్రమతో, కోనేరు మారుతి ప్రసాదు గారి 58,000/- ఖర్చుతో 3 ½ కిలోమీటర్ల వెంకటాపురం రోడ్డు అందాన్నీ DRK గారు ప్రస్తావించారు.
రేపటి వేకువ కూడ ఇదే వీధి శుభ్ర-సౌందర్య సాధనకై శివరామపురం రోడ్డులోనే కలుద్దామని నిర్ణయించారు!
కార్యకర్తా! వందనం!
ఇదేదో ఒక పూట కాదే-రోజుకాదే-నెలయుకాదే
ఏకముగ ఒక పుష్కరంగా ఏకబిగిగా శ్రమోద్యమమే-
సమయదానమె-అర్థదానమే-కాయకష్టమె-నిరంతరమే!
కనుకనే ఓ స్వచ్ఛ సుందర కార్యకర్తా! వందనం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
17.02.2026