3749* వ రోజు ............           19-Feb-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

గురువారం (19-2-26) నాటి 35 మంది బాధ్యతలు - @3749*

               ఆ బాధ్యతలు చల్లపల్లికి దూరంగా, 4 గ్రామాల సామాజిక చైతన్యవంతులు నేరవేర్చినవి: వేకువ 4.16 కే మొదలై, అపలేక-ఎట్టకేలకు 6.20 కి ఆగినవి; మహిళలూ, పెద్దలూ, వివిధ సామాజిక నేపధ్యాల వారు కలిసికట్టుగా NH 216 నుండి చల్లపల్లి దిశగా శివరామపురం రోడ్డులో 150 గజాల బారునా జరిగిన శ్రమజీవన సౌందర్య దృశ్యాలవి!

               పన్నెండేళ్లుగా జరుగుతున్న ఇలాంటి వాస్తవాలను నేను వ్రాస్తుంటే-ఇవేవో కల్పనాత్మక కవిత్వాలని తేలికగా తీసుకోవద్దు. ఒక్కోమారు వాస్తవాలే కల్పనలుగా అనిపిస్తాయి!

               చల్లపల్లిలోని నమ్మశక్యం గాని శ్రమదానాన్ని సందేహించిన సుదూర ప్రాంతం వాళ్ళు వేకువ కాలపు వీధి సేవలను స్వయంగా వచ్చి చూసి, ధృవపరుచుకొని వెళుతుంటారు! అదృష్టంగా భావించి, ఆ ఒక్కపూట చల్లపల్లి స్వచ్ఛ సుందర కార్యకర్తలుగా మారిపోతుంటారు! తమ ఊళ్లలోనూ సామూహిక శ్రమదానాలు మొదలుపెడుతుంటారు కూడ!

               అసలింతకీ ఈ గ్రామంలో సుదీర్ఘ సామాజిక కర్తవ్యాలు ఎందుకంత నమ్మశక్యంగా లేవు-అంటారా?

               మన సమకాలిక రాష్ట్రంలో గాని-దేశంలో గాని ఇలా గృహిణులు వేకువ 4:00 కాక ముందే బయల్దేరి, రహదార్ల వెంట ఊడుస్తారా? పెద్దపెద్ద డాక్టరమ్మలూ, డాక్టరయ్యలూ చెత్తపనులకు దిగుతారా? తన విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో జరిగే ఈ ఉద్యమం కోసం ఒకానొక ఉపాధ్యాయ వృద్ధుడు చల్లపల్లికి నివాసాన్ని మార్చుకొంటాడా?

               సుందరీకర్తలనే బిరుదు పొందిన 5 గురు ఈ పాతిక గజాల రహదారి పల్లాలను రాళ్లు మోసి, మట్టి పరచి, రోడ్డు భద్రతకు పూచీపడతారా?

       ఇన్నిన్ని మురికి-డ్రైను పనులు చేస్తూ వీళ్ళకాక ఎవరైనా ఇలా ఆనందిస్తారా?

               ప్రతి వేకువా బండెడు చెత్తా చెదారాన్ని ప్రోగేసి, డంపింగు యార్డుకు చేరుస్తారా?

               “ఊరి కాలుష్యాల సంగతి మనకు మాత్రమే పట్టిందా? పర్యావరణమేమైపోతే మనకేమిటి...” అని ఈ 40-50 మంది కార్యకర్తలూ మిన్నకుండిపోవచ్చును గదా?

               అదీ-చల్లపల్లిశ్రమదాన బాధ్యతంటే! అదే మరి ఈ స్వచ్ఛ కార్యకర్తల విశిష్టతంటే!

               నేటి తుది సమావేశంలో :

               - గంధం లక్ష్మణ మృదుస్వర స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ,

               - జనవరి నెల ట్రస్టు సంబంధిత జమా ఖర్చులూ, DRK గారిచే విలువల వ్యక్తిత్వ వికాస పాఠాలూ,

               రేపటి వేకువ సైతం ఇదే శివరామపురం బాటలోని నివాస సముదాయ వీధి సుందరీకరణే అనేవే ముఖ్యాంశాలు!

               సహకరించద ఇప్పుడైనా?

అహరహం అణువణువు శోధనె, ఆత్మ శీలనె, సదవగాహనె

చిన్న పొరపాటైన జరుగక - చేయు కృషులకు పునశ్శోధనె

కనుకె దైనందిన శ్రమోద్యమ మునకు చక్కని ప్రజాస్పందన

చల్లపల్లి ప్రజానీకం సహకరించద ఇప్పుడైనా?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   19.02.2026