3750* వ రోజు ............           20-Feb-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

20-2-26 నాటి (శుక్రవారం) 3750* వ శ్రమదాన కథ!

               కథ స్వచ్ఛ చల్లపల్లిదే, కథ నడిపినది 35 మంది కార్యకర్తలే, కథాసమయం ఇంచుమించు  ఎప్పటిలాగే వేకువ 4:20-6:20 మధ్యస్తమే, పెదకళ్లేపల్లి రహదారి కాలుష్యాల అంతు తేలుస్తున్న సదరు కథను వ్రాస్తున్నది కూడ ఆ 35 మందిలో ఒకడే. చదివి, ఆలోచించి, రేపటి నుండి ఆ కథలో పాత్రలుగా మారవలిసింది గ్రామస్తులే! ఐతే –

               - ‘ఒక యువరాణి పేదయువకుని ప్రేమించెను, దొంగలెత్తుకుపోతున్న రాణిని ఆ యువకుడు రక్షించి, ఆమె తల్లిదండ్రుల్ని మెప్పించి, ఆమెను వివాహమాడెను’....లాంటి రొటీను రొమాంటిక్ తరహా కథ కాదిది;

               గ్రామ సమాజాన్నుండి ఒక్క పైసా ప్రతిఫలమాసించక పన్నెండేళ్ల మూడు మాసాల నుండి ఎండా- వానా-చలీ-మంచుల్ని లెక్కచేయక 4 లక్షల పనిగంటల పాటు కత్తులతో, దంతెలతో, చీపుళ్లతో గ్రామ, రహదార్ల కాలుష్యాల మీద వీరవిహారం చేస్తున్న ఒక గ్రామానికి చెందిన స్వచ్ఛ సైన్యం కథ ఇది!

               పైగా ఇదొక పూర్తి పారదర్శక కథ! దీన్ని చదివి, మరింతమంది క్రొత్త కార్యకర్తలు తయారైతే-చల్లపల్లికి తీరుతుంది పర్యావరణ వ్యథ! దక్కుతుంది భావితరాలకు స్వచ్ఛ-శుభ్ర సౌందర్య సుధ!

               నడుస్తున్న ఈ స్వచ్ఛ సంస్కృతీ నిర్మాణ చరిత్రకు సాక్ష్యంగా 4:20 కి 13 మంది కార్యకర్తలు తొలి ఫొటో దిగారు. గబగబా మిగిలిన 22 మందీ శివరామపురం బాటలో పెట్టబోయే గ్రావిటీ పాఠశాల వద్దకు చేరుకొన్నారు. చేతొడుగులూ, తల దీపాలూ ధరించారు. తమ తమ పనిముట్లు ధరించి, రహదారి కాలుష్యాల మీద తిరగబడ్డారు.

               వాళ్ల దెబ్బలకు జడిసి వీధి దుమ్ముల, సింగిల్ యూజ్ ప్లాస్టిక్కుల కాలుష్య భూతం తోకముడిచింది, వ్యర్ధాలతో ట్రాక్టర్ నిండింది, 150 గజాల వీధి శుభ్రపడింది, బట్టలకూ-ఒంటికీ చెమటా-దుమ్మూ కొట్టుకొంటేనేం? అనుకొన్నది సాధించినందుకు కార్యకర్తలు బాగా సంతృప్తి చెందారు.

               అప్పుడు మ్రోగింది DRK గారి పని విరమణ విజిల్,

               ఐతే-పని జరిగే వీధి నివాసాల, షాపుల నుండి ఒక్కరూ పాల్గొనలేదేమని ముందుకొచ్చిందొక     పజిల్!

               అంతలో మ్రోగాయి ఒక వృద్ధ గోపాలకృష్ణ వైద్య కంఠం నుండి నినాదాలు,

               దీటుగా బదులిచ్చాయి-34 కంఠాలు.

               దాసరి రామకృష్ణుల వారి సమీక్షా వచనాలు, గురవయ్య గారి సూక్తులూ,

               రేపటి శ్రమదాన కథా స్థలం కూడ ఈ పెదకళ్లేపల్లి బాటలోననే నిర్ణయాలతో నేటికి ముగిసిందా కథ!

               చల్లపల్లి వాస్తవ్యులు మొక్కపాటి పాండురంగారావు గారి స్మృత్యర్ధం వారి శ్రీమతి పార్వతమ్మ గారు స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం కోసం కుమారులు శివ కార్తీక్, ఫణీంద్ర గార్ల ద్వారా 1,00,000/- రూపాయల చెక్కును విరాళంగా అందజేసినందుకు ధన్యవాదములు.

               గాలి వాటమొ నీటి బుడగా?

గాలి వాటమొ నీటి బుడగో కాదుసుమ ఈ శ్రమోద్యమము

చల్లపల్లి ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిగ’ మారు వరకూ

పర్యావరణం బాగుపడి మన ప్రజాస్వస్తత గెలుచువరకూ

ఆగబోదది - సాగుతుందది స్వాగతిద్దాం శ్రమోద్యమమును!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   20.02.2026