3751* వ రోజు ............           21-Feb-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

శివరాత్రి అనంతర శివరామపురం రహదారి పండుగ - @3751*

               అంటే-21-2-26 న 43-2=41 మంది కార్యకర్తలు 4 వారాల నుండీ  ఒకే రహదారిలో నిర్వహిస్తున్న సామాజిక బాధ్యతలన్నమాట! (-2 అనగా భాగ్యనగరంలోనే ఉన్నా- మనసంతా ఇక్కడే ఉండే ఇద్దరు స్వచ్ఛ వైద్యులు!)

               సామాజిక స్పృహచాలని వేలాది మందికి కనువిప్పుగా 4:17-6:20

ల మధ్య ఈ శనివారం శ్రమదాన పండుగ జరుపుకొన్న ఈ కార్యకర్తల ఉద్దేశ్యమేమిటి? ధన సంపాదనా? కాదు-వీళ్లలో కొందరు నెలనెలా ఉద్యమ ఖర్చులకు చందాదారులే!

               ఈ మురికి చెత్తపనులు చేసేది కీర్తి కొరకా? అంటే అదీ కాదు, అలాంటి ఆశయంకోసమైతే అత్యధికులు నిద్రించే ఈ బ్రహ్మముహుర్తాన – 3751 రోజులు శ్రమిస్తారా?

               మీడియా దృష్టిలో పడి, టీ.వీ.ల్లోకి, పేపర్లలోకి ఎక్కాలనీ కాదు-ఇంతటి అపూర్వ శ్రమదానానికి వాళ్లు చెప్పే కారణాలివి:

1) సమాజం నుండి తీసుకొనే దానిలో కొంతైనా చెల్లించాలనీ,

2) ఏరోజుకారోజు పదిమందికీ పనికొచ్చే మంచి పని చేసిన తృప్తి కోసమనీ,

3) ఈ సుదీర్ఘకాల వేకువ సమయపు శారీరక శ్రమతో తమ ఆరోగ్యం కూడ బాగుంటుందనీ,

               దురదృష్టమేమంటే-ఇవి చాలమంది దృష్టిలో సిల్లీ కారణాలు! తోచీతోచని కొందరు తమ చేష్టలకు సమాజసేవలనే పేర్లు పెట్టుకొంటారని!

               నాదృష్టిలో-కొన్ని చెడ్డ వ్యసనాల్లాగే ఈ కార్యకర్తల శ్రమదానం ఎవరేమనుకొన్నా ఒక మంచి వ్యసనం.

               ఈ మంచి వ్యసనపరులు 60 పని గంటల రహదారి శ్రమతో శివరామపురం బాటలో మరొక 150 గజాల మేర శుభ్రంగా, అందంగా మారింది!

               రోడ్డుకిరువైపులా చిన్న పంట కాలువ చోట్ల 2 గోతాల సీసాలు బైటపడినవి, ముఖ్యంగా-ఆరేడుగురి కష్టం రోడ్డు తూర్పు భాగాన్ని అందంగా రూపొందించినది, వీధి పడమర ఖాళీ స్తలం చూడముచ్చటగా కనిపిస్తున్నది.

               మొత్తమ్మీద అణిచిపెట్టి త్రొక్కగా పెద్ద ట్రాక్టరు వ్యర్ధాలకు విముక్తి దొరికింది, ఎండుకొమ్మలూ, మొండి చెట్లూ లేని ఒక మంచి రహదారి భాగం తయారైంది!

               ఈ మంచి కార్యక్రమానంతర సమీక్షా సమావేశాన్ని లక్ష్మీ సెల్వం నినాదాలతో ప్రారంభించగా –

               రేపటి శ్రమదానం క్రాంతి కళాశాల ప్రదేశమని నిర్ణయించబడింది!

               “చల్లపల్లికి వారసులు” అని

నిక్కమైన-స్వచ్ఛమైన నిబద్ధతలకు నిలయులై, సొం

తూరిపై మమకారముండి, వేల-లక్షల గంటలైన శ్ర

మించ సంసిద్ధతలు గల ఈ స్వచ్ఛ సుందర కార్యకర్తలె

“చల్లపల్లికి వారసులు” అని సగర్వంగా చాటవచ్చును!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   21.02.2026