ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1865* వ నాటి గ్రామ స్వచ్ఛ చర్యలు.
గతంలో కంటే భిన్నంగా ఈరోజు 4 గంటలకు బదులు ఉదయం 5 గంటల నుండి 6.15 నిమిషాల దాక జరిగిన గ్రామ బాధ్యతా నిర్వహణలో పాల్గొన్న ధన్యులు 23 మంది. సుందరీకృత ప్రాంతం కూడా సోమవారపు సాంప్రదాయం కాక, బందరు మార్గంలో 6 వ నెంబరు పంట కాలువ వంతెన నుండి అమరావతి రాజు గారి వీధి ప్రవేశ ద్వారం దాక ఇది నిర్వహింపబడింది.
ఇందులోనూ, ఎక్కువ మంది చీపుళ్లకే పని కల్పిస్తూ, ఒక పర్లాంగు మేర ఈ ప్రధాన రహదారిని ఆకర్షణీయం చేయగా రోడ్డు ప్రక్క అక్కడక్కడ పిచ్చి మొక్కలను కొందరు తొలగించారు. దారి అంచులలో అంటుకొని బిగుసుకుపోయిన మట్టి - ఇసుక మిశ్రమాన్ని ఒక నలుగురు గోకుడు పారలతో కదిలించి, గుట్టలుగా పొగుచేసి, ఇతర వ్యర్ధాలతో బాటు 'మనకోసం మనం' ట్రస్టుకు చెందిన ట్రక్కులోనికి ఎక్కించి చెత్త కేంద్రానికి పంపారు.
దారి ప్రక్క వెలసిన తాత్కాలికమైన బట్టల, పండ్ల, పూల మొక్కల దుకాణాల వ్యర్ధాలు చల్లపల్లి గ్రామ శుభ్రతకు ఆటంకాలయిపోతున్నవి. గ్రామం పట్టణంగా మారుతున్న ఈ సంధి కాలంలో ఇది వింతకాకున్నా ఆయా దుకాణదారులే అంతిమంగా అక్కడి స్వచ్ఛ శుభ్రతల బాధ్యులవుతారు.
స్వచ్ఛ కార్యకర్తల గంటన్నర నిస్వార్థ కృషి పిదప ఈ దారి ఎంత సుందరంగా ఉన్నదో గమనించి సదరు గౌరవ వ్యాపారులు జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. నేటి కాఫీ/ కబుర్ల అనంతర సమీక్షా సమావేశంలో గోళ్ళ ద్రోణ ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్ఛ - శుభ్ర - సుందర సంకల్పంతో ఈనాటి మన ఈ పవిత్ర బాధ్యత ముగిసింది.
రేపటి మన పౌర విధి నిర్వహణను బందరు మార్గంలోని మునుసబు గారి వీధి నుండి ప్రారంభించవలసి ఉంది.
ఈనాటి స్వచ్చోద్యమ చల్లపల్లి మరొక ప్రత్యేకత మన 40 మంది కార్యకర్తల 'విశాఖ యాత్ర'! నిన్నటి సాయంత్రం 8 గంటలకు బస్సులో ప్రయాణించి సాగర తీర విశాఖ నగర - సీతమ్మధార వద్ద ఆగిన వీరు యధావిధిగా తమ దైనందిన స్వచ్ఛ సంకల్ప నినాదాలను అక్కడి రోడ్డు మీద కూడా ప్రకటించి విశాఖ ప్రజలను ఆశ్చర్యపరిచారు. నేడు, రేపు కూడా ఈ బృందం ఒక స్వచ్ఛ బహుమతి స్వీకరణకై ఈ నగరంలోనే ఉంటుంది.
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు,
శుక్రవారం - 20.12.2019
చల్లపల్లి