3753* వ రోజు ............           23-Feb-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

సోమవారం నాటి శ్రమదాన సంగతులు - @3753*

               23.2.26 వేకువ 4.19 కే అవి 9 మందితో శ్రీకారం చుట్టుకొని 6.20 కి 2 వ విడత విజిల్ మ్రోతతో ముగిసినవి. కార్యకర్తలంతా కలిసి 28 మంది అని గుర్తు!

               “గ్రామ జన సంఖ్యతో పోల్చుకొంటే ఈ అల్ప సంఖ్యాక కార్యకర్తలు సాధించినదేమిటి? ఊరి వాళ్లకిస్తున్న సందేశమేమి?

గ్రామస్తుల స్పందనలెంత వరకు?....” అని ఆరా తీస్తే....

1. నేటి వేకువ స్వచ్ఛ కార్యకర్తల బలగం కాస్త తగ్గిందే తప్ప వాళ్ల పట్టుదల, పని ఊపు తగ్గలేదు. 2 గోడౌన్ల బారునా డ్రైనులో దిగి కొందరూ, గట్టున కూర్చొని కొందరూ కొన్ని ముళ్ల చెట్లను తొలగించారు, ఇప్పుడా 70-80 గజాల ప్రాంతంలో గడ్డి కనిపిస్తుందేమో చూసి, చెప్పండి!

2. రోడ్డు వైపున సరే-గోడౌన్ల గేట్లలోతట్టునా 3 గోనె సంచుల గాజు-ప్లాస్టిక్ సీసాలు సేకరించారు. అలాగే ఇతర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు కూడ!

3. గ్యాస్ కంపెనీ గోడౌన్ ప్రక్క మురుక్కాలువ మాత్రం తక్కువ తిన్నదా? దాన్నుండి మాత్రం 9 మంది కార్యకర్తలు ½ ట్రాక్టరు పిచ్చి మొక్కల్నీ, ఎండు కొమ్మల్నీ, ఇతర తుక్కునూ సమీకరించలేదా?

4. కత్తుల గురవయ్యలూ, ఎడమ వాటం ప్రసాదూ, అంబటిరావూ వంటి వారు ఒంగొనీ, కూర్చొనీ, కత్తులతో గంటన్నరకు పైగా ఎలా పనిచేస్తారో, ఎందుకు వాళ్ల చేతులు నొప్పి చేయవో వాళ్ళకే తెలియాలి!

5. ఒక చేత కత్తీ, ఒక చేత గొర్రూ ధరించిన K.V.R లూ, మహిళా కార్యకర్తలూ ఏదో సామాజిక బాధ్యత అనే పూనకంతోనో-కూనిరాగాలతోనూ-కబుర్ల సందడితోనో తప్ప ఇంత శ్రమను ఎలా ఓర్చుకొంటారు?

6. ఇలా వరసపెట్టి చెప్పుకుంటూపోతే...కస్తూరి, బృందావన, నరసింహ, హేమంతాది కరుడుగట్టిన కార్యకర్తల శుభ్ర-సుందరీకరణ చర్యలెన్నో ఉంటాయి!

               నేటి 150 గజాల వీధి బాగుదలలో ఏ ఒక్క కార్యకర్త వాటా తక్కువ కాదు! నాలాంటి ఇద్దరు ముగ్గురివి మాత్రమే ఏవో పైపైన ప్రయత్నాలు!

               కాఫీల వేళ వెంకటాపురం పాఠశాల H.M. సుభాషిణి గారి 2 రకాల-2 సంచుల మిర్చి పంపకమూ, గురవయ్య నినాదాలూ, సూక్తులతోబాటు -

               రేపటి మన కలయిక H.P గ్యాస్ కంపెనీ ప్రాంతలో అనే నందేటి శ్రీను గారి ప్రకటనా ముఖ్యాంశాలు!

               ప్రస్తుతించకుండగలన?

 “పాతిక వేల జనాలకు పట్టని పని మాకెందుకు?

పంచాయతి, ప్రభుత్వాల బాధ్యతలవి మనకెందుకు?...”

అని తలవక ప్రతి వీధిని సుందరముగ మార్చుచున్న

పెన్షనర్లు-వృద్ధులనూ ప్రస్తుతించకుండగలన ?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    23.02.2026