3755* వ రోజు ............           25-Feb-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

ఇదుగా-3755* వ శ్రమదానం!

               31 మందితో-బ్రహ్మముహుర్తన-25.2.26 న-పెదకళ్ళేపల్లి మార్గంలోని విజయా కళాశాల మొదలు మాంసదుకాణ దాకా విజయవంతమైన వీధి కాలుష్యహంతక సామూహిక శ్రమదానమది!

               అసలింత మందిని 3.30 కే ఎవరు మేలుకొల్పారు? ఊరి వెలుపలి రహదారిని ఊడవమనీ, డ్రైన్లు శుభ్రం చేసి, ఆ ఘాటు దుర్వాసన తగ్గించమనీ, వీధి మార్జిన్ల ఎగుడుదిగుడులను సమం చేయమనీ, గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ తొలగించి, వేల కొద్దీ చెట్లూ-పూల మొక్కలూ పెంచాలనీ, ఎవరు బోధించారు?.....

               ఇలాంటి ప్రశ్నల్నే సంధిస్తే-కార్యకర్తలేమో ‘ఎవరో వచ్చి బొట్టు పెట్టి పిలవాలా? ఇది మా ఊరు కాదా? ఈ ఊరి ప్రజల ఆహ్లాదం మేం పట్టించుకోమా? ఆ మాత్రం సామాజిక బాధ్యత ఉండొద్దా?.. అని ఎదురు ప్రశ్నలేస్తారు!

               పన్నెండేళ్లుగా అదే పట్టుదల-ఊరి వీధుల్ని సరే శ్మశానాల బాగోగులు సరే-రోడ్ల గుంటలు పూడ్చడమట్లా ఉంచి, ఊరి చుట్టూ అష్టమార్గాలలో చెట్లు పెంచి, ఎవరి మెప్పులకో ఎదురు చూడక-తమ కర్తవ్యం తాము నెరవేర్చుకొనే సంతృప్తితో సాగుతున్న ఈ శ్రమవేడుకనెలా విశ్లేషించాలి!

               ఈ 25 వ ఫిబ్రవరి నాటిది కూడ మళ్లీ అదే కథ! పదిమంది వీధి పారిశుద్ధ్య దీక్షాపరులతో 4.15 కే మొదలై, 31 మంది శ్రమ నీరాజనంతో 6:20 కి ముగిసింది!

               ఎవరు ఆ సమయంలో వచ్చి, ఆ 40 పనిగంటల పారిశుద్ధ్య ప్రయత్నాలను చూసినా, ఆశ్చర్యపడక తప్పదు-స్పందనగుణం ఉంటే-కార్యకర్తలతో మరునాటి నుండి చేతులు కలిపినా కలపొచ్చు!

               తక్కిన పనులట్లా ఉంచి, వీధి పడమర డ్రైను నుండి బండెడు వ్యర్ధాల్ని లాగి, నిలవ కంపు మురుగునీటిని ముందుకు నడిపించిన ఏడనమండుగురి మొండి పట్టుదలకు జోహార్లు!

               నేటి నినాదాల వంతు లంకే సుభాషిణి మేడమ్ ది! పనుల సమీక్షా సంతోషం డి.ఆర్.కె. డాక్టరు వంతు!

               రేపటి శ్రమదానం బండ్రేవుకోడు కాల్వ వంతెన దగ్గర అనేది సమష్టి నిర్ణయం!

               అని మాత్ర యోచింపుడు!

స్వచ్ఛ కార్యకర్తల యెడ పక్షపాత ధోరణిలో

ఉన్నవి లేనివి వ్రాయుచు ఉబ్బేస్తున్నాననుకొనకుడు

“గ్రామ- రాష్ట్ర చరిత్రలో కలదా అసలీ సుదీర్ఘ

శ్రమదానోద్యమ ఘట్టం?” అని మాత్ర యోచింపుడు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   25.02.2026