3756* వ రోజు ............           26-Feb-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

అన్ని గ్రామాలకు ఆచరణీయమైన వీధి పారిశుద్ధ్యం - @3756*

               అది జరిగింది చల్లపల్లి to పెదకళ్ళేపల్లి బాటలోని బండ్రేవుకోడు కాల్వ వంతెన సమీపంలోని నూనె మిల్లు – కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండప ప్రాంతాలలో; పని సమయం వేకువ 4.20 - 6.20 ల మధ్య; పని వాళ్లైతే 86 ఏళ్ల వయస్సు వారితో సహా డాక్టర్లు, గత మరియు ప్రస్తుత ఉపాధ్యాయులు, రైతులు, వ్యాపారులతో గూడిన 31 మంది!

               మరి - “ఇంత వేకువ వేళ - చలిలో ఊరి వెలుపల రోడ్ల దుమ్ము దులిపే - దుర్వాసనల మురుగు కాల్వలు శుభ్రపరిచే - అవసరమైతే రోడ్ల గుంటలు పూడ్చే.... బొత్తిగా అగౌరవప్రదమైన పనులకేల పాల్పడవలసివచ్చిందో? అంటే - అది వాళ్ళ ప్రారబ్దం!

               ఈ ప్రశ్నే వాళ్లనడిగితే – “ప్రారబ్దం కాదు, ఇది మా సామాజిక బాధ్యత” అని బదులిస్తారు! వీరిలో మరికొందరైతే – ‘ఇది మా ఆరోగ్య రహస్యం - మాకు దక్కిన అదృష్టం!” అని కూడా అంటారు!

               ఎంత ఇష్టపడకుంటే - వాళ్లు పన్నెండేళ్ళుగా ఊరికి ఇన్నిన్ని చాకిరీలు చేస్తారు? ఈ చల్లపల్లి ఇంత గణనీయంగా స్వచ్ఛ-సుందర –పరిశుభ్ర-సౌకర్యవంతంగా మారేదా?

               అలాంటి శ్రమదాన ధారావాహికలో ఈ 26.02.2026 - గురువారం నాటిదొకటి! మంచి బుద్ధిగా డజను మంది 4:20 కే వంతెన వద్ద నిలిచారు; అంత బుద్ధి తెచ్చుకొని ఆ నూనె మిల్లు ఎదుటి, ప్రక్కన ఖాళీ స్థలాల దగ్గరి, అటుగా ప్రాత చంద్ర ఆస్పత్రి సమీప, మాంస దుకాణ ప్రాంతపు కాలుష్య దరిద్రం పారిపోయింది - చూడండి!

               కార్యకర్తల కత్తివేటులకు పిచ్చి, ముళ్ల చెట్లూ, గడ్డీ తొలగి 150 గజాల వీధి శుభ్రంగా విశాలంగా ఉన్నదో లేదో గమనించండి! అంతేమరి - మనుషుల కాయకష్టమే – వాళ్ల సత్సంకల్పమే ఇలాంటి సామాజిక విజయాలు, సాధిస్తుంది! వాళ్ల సదాశావహ-సహన దృక్పథమే గ్రామ హరిత-ఆహ్లాదకారణం!

               6:40 కి 31 మందీ తమ ఊరి జనులకు తమ సంకల్ప తెలిసేలా కస్తూరి విజయ్ కుమార్ గారు ఎలుగెత్తి చాటిన స్వచ్ఛ సుందరోద్యమ సంకల్ప నినాదాలూ, నేటి శ్రమ ఫలితాల పట్ల డి.ఆర్.కె. గారి సంతృప్తీ షరామామూలే!

               రేపటి మన శ్రమదాన బాధ్యత బస్ స్టాండు తూర్పు రోడ్డులోనట!

               నభూతో నభవిష్యతి

ఈ పుష్కర శ్రమ వేడుక నభూతో నభవిష్య”

అనుకొనడం సరికాదని, యౌవనులూ బాల్యస్తులు

కొనసాగిస్తేనే గ్రామం కను విందుగ స్వస్తతగా

మారుననీ విశ్వసించి మనం సహకరించుదాం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   26.02.2026