3757* వ రోజు ............           27-Feb-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

ఇలాంటి సుందరీకరణ శ్రమ గ్రామగ్రామానా జరగాలి! - @3757*

               అన్ని గ్రామాల చైతన్యశీలురూ వారి వారి ఊళ్ల – వీధుల పారిశుద్ధ్యం మీద ఇలా ఒక కన్నేసి ఉంచాలి! ఇది పన్నెండేళ్ల శ్రమదానం కొలతగా కాక, ప్రజల జీవనశైలిగా మారాలి! పచ్చదనాల, పరిశుభ్రతల, వీధి సౌందర్యాల స్పృహ అందరిలో పెంపొందాలి!

               ఇంకా వివరించి చెప్పాలంటే - ప్రతి గ్రామానికి ఒక గంగులవారిపాలెం వీధో, కమ్యూనిస్టు వీధో ఆ గ్రామాలకు ఆదర్శంగా మారాలి!

               అప్పుడిక ఏ ఊరికీ DRK లు అక్కరలేదు, ఆపసోపాలు పడుతూ, చెత్తల - మురుగుల మీద ఉద్రేక పడుతూ కోడూరీ, అంబటి లాంటి వాళ్ళు ప్రత్యేకించి పనులకు దిగే అవసరం ఉండదు;

               శివరాంపురం బాటలోని బరువు పనులకు సజ్జా వాళ్లూ, కస్తూరి వారూ, ఆకుల వాళ్ళు, బృందావన – బి.ఎస్.ఎన్ లు హైరానా పడే అగత్యం ఉండదు!

               ఎవరి లోగిళ్ళ ముందు, వీధుల్లో వాళ్లు అప్పుడప్పుడూ కాస్త శుభ్రపరచుకొన్నా చాలు - ఇలా వేకువ కాలపు మహిళల - వృద్ధుల, ఉద్యోగుల అనునిత్య శ్రమదానాలను గూర్చి చర్చిచుకొనే అవసరమూ ఉండదు! అన్ని ప్లాస్టిక్ - గాజు సీసాలను ఏరి, వంతెనల దుమ్ములు వదలగొట్టి, వ్యర్ధాలను గబగబా ట్రాక్టర్లలో నింపుకొని, చెత్తకేంద్రానికి చేర్చే కార్యక్రమాలూ మిగలవు!

               6.35 కు కాఫీలయ్యాక – 31 మందీ అర్థవలయంగా ఏర్పడి, తూములూరి లక్ష్మణ ప్రవచిత నినాదాల ప్రత్యేకత మాత్రం ఎందుకుంటుంది?

               అన్ని వీధుల వారూ అప్రమత్తులైనపుడు ఈ పల్నాటి అన్నపూర్ణమ్మల తిరుపతి లడ్డూ ప్రసాద వితరణలూ, లంకే సుభాషిణి టీచర్ కూరగాయల పంపకమూ, ప్రాతూరి - మాలెంపాటి ద్వయం చాక్లెట్లూ ప్రత్యేకించి ఈ సామూహిక శ్రమానంతరం ఎందుకు?

               రేపు అనగా 28.2.26 శనివారం నాడు గంగులవారిపాలెం రోడ్డు సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ వీధి వద్ద కలుసుకుందాం!

               ప్రణమిల్లక ఎట్లుందును?

 అసహ్యకరమగు మురుగును, అంతకన్న హేయమైన

పేడలెత్తి, కసవులూడ్చి, వీధులనే ఇళ్లనుకొని

శుభ్రపరచుచున్న పెద్ద పోరాటం చూసికూడ

స్వచ్ఛ కార్యకర్తలకు ప్రణమిల్లక ఎట్లుందును?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

 

   27.02.2026