3759* వ రోజు .........           01-Mar-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

                        ఈ 3759* వ నాటిశ్రమదానం స్వచ్ఛపథం! శుభప్రదం!

    ఆదివారం (1.3.26) కావడం కారణమేమో - ఈ వేకువ సమయాన కూడ 4.18 కే 19 మంది, షెడ్యూల్డ్ కాలానికి అటూ ఇటూగా మరొక 36 గురూ - వెరసి 55 మందితో గంగులవారి పాలెం బాటలోని పద్మాభిరామం మొదలు- కొలిమి మేస్త్రిగారి పాల ఉత్పత్తి కేంద్రం దాక సందడే సందడి! సందడి  ముగింపు సమయం 6.20.

      సందడంటే ఏ ఫంక్షన్ ఉత్సాహమో కాదు – మూడూళ్ళ నుండి బ్రహ్మకాల పూర్వమే లేచి, 4 కిలోమీటర్ల దూరాన్ని గడిచి, చల్లపల్లి జన జీవన సౌకర్యం కోసం దుమ్మును పీల్చే- డ్రైన్ల కంపులు భరించే - చెమట చిందించే శ్రమదాన సందడి! అది కూడ ఒక్కనాటి ఆరంభ శూరత్వమో నెల నాళ్ళ శ్రమ సంరంభమో కాదు సుమా- 11-12 ఏళ్ల కత్తిమీద సాములాంటి గ్రామ సుందరీకరణ క్షిష్ట ప్రయత్నం!

    3759 నాళ్లుగా ఇదేతంతు! జంటలుగా - విడివిడిగా - బృందాలుగా 4.30 కు వస్తారు; చేతొడుగులూ, తలదీపాలూ, వీధి శుభ్రతా పనిముట్లు ధరిస్తారు; వీధి అందాలకు భంగకరములైన చెత్తా, గడ్డీ, ప్లాస్టిక్ తుక్కు లూ ఏరి వేస్తారు; చెట్ల కొమ్మల లోపాల్ని సరిజేస్తారు; మురుగు నీరు నిలిచి పోతే కంపుల్ని లెక్క చేయక, సిల్టు తొలగిస్తారు; మధ్యే మధ్యే తమ పనుల గురించి జోకు లేసుకొంటారు కూడ!

               ఇలా 2 గంటలు ఏదొక వీధిలో శ్రమించి, 6.20 కాగానే విజిలు మ్రోత విని, పని విరమించి, సమీక్షా సభలో నినాదాలు ప్రకటించి, మరునాటి పనుల్ని నిర్ణయించుకొని, నిష్క్రమిస్తారు!

         ఈ ఆదివారమూ మరొకమారు అవే పనులు; ఉడుత్తువారి, చిన్నారి ఆస్పత్రి వారి స్తలాల వద్ద డ్రైను పూడిక, బోగన్ విలియా ముళ్లపూల చెట్ల సుందరీకరణా, వీధి ఊడ్పులూ, వ్యర్థాల లోడింగులూ షరా మామూళ్లే గాని-

    మాజీ DSP గారి ఇంటి వెనుక పల్లం ఖాళీ జాగాలో 20 మంది ఎంతగా సుందరీకరించారంటే పని ముగిశాక అందరూ అక్కడే నిలబడి, తమ సభ జరుపుకొన్నారు!  నిన్న బాణావతు రమేశ్ నినాదాలూ,

     నేటి Dr. పద్మావతి గారివీ, AI సహాయంతో రావి రమణ గారి ఆంగ్ల లేఖానువాద పఠనమూ,

     వీటితో బాటు మా ఇంటి ముందు దుర్గాప్రసాదు, అన్నపూర్ణాదుల వీధి బాగుదలా, క్రొత్త కార్యకర్తల సరఫరా దారుడు వెంకటేశ్వరరావు టీము పంచిన అందమైన గుడ్డ సంచులూ, మూటల కొద్దీ టొమేటోలను సుభాషిణీ మేడం పంపకమూ, శాస్త్రి గారి + మాలెంపాటి వారి చాక్లెట్ల పంపిణీ  కొన్ని ముఖ్యాంశాలు!

    రేపటి వేకువ కూడ మన బాధ్యతలు గంగుల వారి పాలెం వీధిలోనే!

                    ప్రణమిల్లుట తప్పుకాదె!

ఇంత చదువుకొన్నది ఈమట్టి పనులు చేయుటకా?

ఇంత బ్రతుకు బ్రతికినది పేడ-పెంట లెత్తుటకా?..”

అని సంకోచించక ఆ విధులను నిర్వర్తించే

స్వచ్ఛోద్యమ కారులకు ప్రణమిల్లుట తప్పుకాదె !

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   01.03.2026