3760* వ రోజు ............           02-Mar-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

3760* వ (సోమవారం-2.3.26) శ్రమదానం గురించి చెప్పాలంటే..

1) అది నిన్నటి నిర్ణయానుసారం 3 వ విడత కూడ మళ్లీ గంగులవారిపాలెం మార్గంలోనే జరిగింది;

2) శని-ఆదివారాల ఉధృతి తగ్గి, సోమవారమైనందున ముప్పై ఇద్దరికే పరిమితమయింది;

3) మరి వీరిలో డజను మందికి తొందరెక్కువై 4:10 కే పనిచోటుకు చేరుకున్నారు; వీళ్లలో ఇద్దరు వెంకటాపురపు విద్యార్థులు 4 కిలోమీటర్ల దూరం నుండి 4.00 కన్న ముందే వచ్చారనీ తెలిసింది;

4) “అసలెందుకీ 4 గ్రామాల కార్యకర్తలు ఇంత చలీ-మంచుల్లో చీకటి వేళ ఒక వీధి పారిశుద్ధ్య సౌందర్యాలకు కృషిచేస్తుంటారా” అని చల్లపల్లి విస్తృత ప్రజానీకం ఆలోచించదో అర్ధం కాకున్నది;

5) చేసే గ్రామోద్దారక పనులేమన్నా సున్నితమైనవా, మర్యాదకరమైనవా, లేక వాళ్ళ సొంత లాభానికా-అంటే అవేం కాదు;

6) “ఎవరి పిచ్చి వాళ్ల కానందం” అనే సామెత ఇలాంటోళ్లను చూసే పుట్టిందేమో” అని ఇప్పటికీ కొందరు గ్రామస్తులనుకొంటున్నారేమో అని సందేహం కలుగుతూనే ఉన్నది;

7) ఇక అసలు విషయం గూర్చి ప్రస్తావించాలంటే:

- మురుగ్గుంటలోకి కాలు జారుతున్నా-అక్కడి కంపు పీలుస్తూ జోడు కత్తుల పని మానని గురవయ్య పట్టుదల గురించా?

- అటు నిశ్శబ్ద అంబటి శ్రమా - ఇటు కేకలతో పని సాగించే కోడూరు వారి శ్రమనా?

- ఇంటి వద్ద సొంత పనులు వాయిదా వేసి వీధి పనులకు దిగిన గృహిణులు, రైతులు, ప్రస్తుత - మాజీ ఉద్యోగుల నిబద్ధత మీదనా?

- చీకటిలో ముళ్ళ చెట్ల మధ్య దూరి, వంగి పనులు చేసే భరత్, శివబాబు, సజ్జా, కస్తూరి సోదరులు, తూములూరి కార్యకర్తల పనులనా?

- గంగులవారిపాలెం వీధిలోని 100 గజాలను తలా కాస్తా కేటాయించుకొని, పోటీగా - సమన్వయంగా - సమర్థవంతంగా తీర్చిదిద్దే అద్భుత సామాజిక బాధ్యత గురించా?

               వీటిలో ఏ ఒక్క దాన్ని గురించయినా ఒక పేజీ వ్రాయాలి!

               6.40 కి Dr. DRK గారి సముచిత సమీక్ష, శ్మశానాల వద్ద జరిగిన - జరుగుతున్న పనుల ప్రస్తావనా, ప్రాతూరి శాస్త్రి గారి 5,000/- చందా కాక, వెంకటాపురం పాఠశాల విద్యార్థుల వ్రాత సౌకర్యం కోసం తలా ఒక ‘ప్యాడ్’ ను శాస్త్రి గారే కేటాయించుట నేటి విశేషాలు.

               నేటి నా నినాదాలిట్లున్నవి : “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి! స్వచ్ఛ సుందర ఆరోగ్య – ఆనంద చల్లపల్లిని - సాధిస్తాం - సాధిస్తాం! స్వచ్ఛ, శుభ్ర ఆలోచనాత్మక చల్లపల్లిని – సాధిస్తాం - సాధిస్తాం!”

               రేపటి కర్తవ్యాలు కూడ భవఘ్ని నగర్ వద్దనే.

            నమస్కరింప కెట్లుందును?

“చెత్తబండి పైకెక్కుట, కత్తితో గడ్డిని నరకుట,

డిప్పలు నెత్తిన మోయుట మగవారల పనికాదా

మాకెందుకు” అని తలపక మరల మరల పూనుకొనెడి

మహిళా కార్యకర్తలకు నమస్కరింప కెట్లుందును?’

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   02.03.2026