పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
ఫలప్రదమైన 3762* వ విడత వీధి శ్రమ!
వరుసగా 5 వ నాటి (బుధవారం 4.3.26) గంగులవారిపాలెం వీధి శుభ్రతకై 14 మందికి 4:14 కే తెల్లవారింది! ఆ తదుపరి 20 మంది చేరికతో సంఖ్య 34! పని విరమణ 6:20 కి – దుబాయి/పావులూరి శ్రీను ఇంటి దగ్గర!
ఇందరి బృహత్ ప్రయత్నంతో 100 గజాల వీధి శుభ్రత! ఊడ్చిన, కత్తులతో నరికిన, దంతెలతో లాగిన, డ్రైన్ల నుండి లాగిన రకరకాల పిచ్చి – ముళ్ళ కంపలూ, గడ్డీ, తీగలూ, కొమ్మలూ ట్రాక్టరు నిండుగా!
నేను గనుక విడివిడిగా ఏ కార్యకర్త ఏ పనులు చేశారో, ఎంత దూరం - శుభ్రపరిచారో, 3 చోట్ల రోడ్డు మార్జిన్ ను అద్దంలా మార్చారో, ప్లాస్టిక్ + గాజు వస్తువులు ఏరారో, ఎవరి కాలు డ్రైనులోకి జారిందో వివరించబూనుకొంటే - ఏరోజుకారోజు ఒక చిన్నపాటి పుస్తకమే ఔతుంది!
ఈ స్వచ్ఛ సుందర ఉద్యమం గురించి చాల మంది అనుకొనేది “ఒక DRK, ఒక పద్మావతి సారధ్యంలో అది చాల బాగా నడుస్తున్నది! తన పదవీ విరమణానంతర పదేళ్ల జీవితాన్ని ఒకానొక శాస్త్రి చల్లపల్లికి అంకితం చేశాడట! ఎవరెవరో అధికార - అనధికారులు సహకరించారట! రాజకీయులూ, దాతలూ ప్రోత్సహిస్తున్నారట!”.....
నిజమే! గృహిణుల, ఉద్యోగుల, రైతుల, వ్యాపారుల పట్టుదల ఈ ఉద్యమ విజయానికి కారణమే! కాని, 10-14 ఏళ్ల వెంకటాపురం విద్యార్థులు చలినీ-మంచునూ లెక్కచేయక చల్లపల్లిలోని ఒక వీధి సౌందర్య సాధనకై అఖిలేష్ – యశ్వంత్ లు 4+4 కిలోమీటర్లు ప్రయాణించిన సంగతేమిటి?
“పాపం! ఇంత చిన్న పిల్లల్ని అమాయకుల్ని చేసి, ఎవరో మాయ చేసి, ఇక్కడి శ్రమదానంలోకి దించారు” అంటారా? ఈ చిన్న పిల్లలే పెరిగి పెద్డై, DRK లుగా మారి, ఎన్నెన్ని మంచి ఉద్యమాలు నడుపబోతారో ఆలోచించారా?
నేటి సమీక్షా సభ 6.30 కి ఆకుల దుర్గాప్రసాదు నినాదాలతో మొదలై, రేపటి వీధి శ్రమ కోసం బండ్రేవుకోడు కాల్వ దగ్గర మొదలు కావాలనే నిర్ణయంతోనూ, సుభాషిణి గారి 2 గోతాల వంగ, టొమాటోల పంపకంతోనూ ముగిసింది!
సాహసమును కీర్తిస్తా!
‘ప్రతి పనిలో నాకేంటని’, ‘గ్రామ భవిత మా కేలని,’
అహంకృతీ అమాయకత అలముకొన్న కాలములో
పన్నెండేళ్లుగా ఊరికి పట్టిన శని తొలగునట్లు
శ్రమిస్తున్న కార్యకర్త సాహసమును కీర్తిస్తా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
04.03.2026