3767* వ రోజు .......           09-Mar-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

సోమవారపు (9-3-26) 3767* వ వీధి శ్రామికులు!

               బొటాబొటీగా 25 మందిలో మొదటి బ్యాచ్ 4:17 నుండే NH 216 గ్రామ స్వాగత 4 రోడ్ల కూడలిలో హాజరు!

               గంగులవారిపాలెం-చల్లపల్లి కూడలి వద్ద జరిగిన కొంత పనితో బాటు, ప్రధానంగా మురుగు కాల్వ వంతెన దాకా, వంతెన నుండి తూర్పు దిశగానూ జరిగిన పనులే ప్రధానమనుకోవాలి!

               జాతీయ రహదారి- వంతెన రోడ్డు పడమర మినపచేను గట్టు దాక డజను మంది 20 కి పైగా పనిగంటల శ్రమతోనే చిన్నా-చితకా పిచ్చి మొక్కలు, ఏపుగా దట్టంగా పెరిగిన రకరకాల గడ్డీ, దాని మాటున దాగిన ప్లాస్టిక్ - గాజు సీసాలూ ఇప్పుడు కనిపించవు!

               వంతెన దక్షిణపు కాల్వగట్టు 20 గజాల మేర అద్దంలా బాగు చేసిన శ్రమ నలుగురిది. కొకాకోలా పెద్ద ప్లాస్టిక్ సీసాల్లో మద్యం కలిపిన క్రొత్త ద్రావకాలు అక్కడ దొరికాయని చెపుతున్నారు!

               నిన్నా, మొన్నా తాము శ్రమించిన చోటనే ఆరేడుగురికి పని దొరికింది. మురుగు కాల్వ లోతట్టు ఏటవాలు చోటైనందున ఒక 60 ఏళ్లు దాటిన కార్యకర్త కాలు జారాడు కూడ!

               ఇంకా గడ్డికోత యంత్రధారుడికి ఎక్కడేం లోపాలు కని పించాయో గాని - ఒక అసిస్టెంటును వెంట బెట్టుకొని ప్రాత చోటులోనే మరను మ్రోగిస్తూ దుమ్ము లేపుతున్నాడు!

               కార్యకర్తల పనుల్లో నేనిందాకా వ్రాసిన సంగతులు కొన్నే! ప్లాస్టిక్ లు ఏరటాలూ, చెత్త లోడింగు చేష్టలూ వీటికదనం!

               నిన్న మా పల్లపాడులో దాని చరిత్ర పుస్తకావిష్కరణ సభలో నా గ్రామస్తుల ఆసక్తి వల్ల స్వచ్ఛ సుందర చల్లపల్లిలో కార్యకర్తల అనుభవాల్ని గురించి చెప్పాను! గోదావరి జిల్లా - కొవ్వలి గ్రామ స్వచ్ఛ సుందరీకరణకు రాక్షసి లాగా పని చేస్తున్న Dr. మనోహరి గారు చల్లపల్లి వాలంటర్ల సుదీర్ఘ ప్రయత్నాన్ని కొనియాడారు!

               నేటి కృషి సమీక్షా సందర్భంలో గంధం బృందావన ప్రవచిత ఉద్యమ నినాదాలూ, నిన్న 6 AM కు  విజయవాడలోని ఆవారా డాక్టరు కాట్రగడ్డ అజయ్ గారి మొండి పట్టుదలతో కృష్ణానది ప్లాస్టిక్ రహితంగా బాగుపడుతున్న వైనాన్ని వివరించిన Dr. డి.ఆర్.కె. గారు, కోడూరు వెంకటేశ్వరరావు గారి నెల వారీ చందా 520/- అందుకుని, భోగాది వాసు గారి బడి పిల్లలకు శాస్త్రి గారు చాక్లెట్ల ప్యాకెట్ అందించి,

               రేపటి మన రహదారి బాగుదల పనులకు NH 216 వద్దనే ఆగాలని భావించారు!

               డెబ్భై- ఎనభై చేతులు

ఔరా! ఈ చల్లపల్లి- అవనిగడ్డ రాదారిలొ

 అమరవీర స్తూపానికి, కాసానగర ప్రాంతానికి

హరిత శుభ్ర సౌందర్యం అందించగ ప్రతి వేకువ

డెబ్భై- ఎనభై చేతులు ఎంతెంత శ్రమించెనొగద!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   09.03.2026