3769* వ రోజు .......           11-Mar-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

విజయవంతంగా ముగిసిన గంగులవారిపాలెం వీధి పనులు - @ 3769*

               బుధవారం ( 11.3.26) వేకువ సేవలు 30 మందివి; సేవలు  ప్రధాన భాగం బండ్రేవుకోడు కాల్వ వంతెన నుండి బందరు దిశగా 50 గజాల NH 216 జాతీయ రహదారి; పనుల ప్రారంభం 4.18 – 6.16AM నడిమి 2 గంటలు!

               ఈ 12 రోజులు - ప్రతి వేకువా 30 నుండి 60 మంది కార్యకర్తల ప్రతి వీధి మెరుగుదల ప్రయత్నాన్నీ గమనించాను, భవఘ్ని – సాయి నగర్ ల స్థానికుల శ్రమ భాగస్వామ్యాలనూ గుర్తించాను, చల్లపల్లి గ్రామ సుందరీకరణల శ్రమదానోద్యమ తత్త్వాన్ని ఎవరెంతగా వంటబట్టించుకొన్నదీ తెలుసుకున్నానుబైటి ప్రపంచం తెలియదనుకొనే సాదా గృహిణుల సామాజిక బాధ్యతలకు ముగ్ధుడనయ్యాను!!

               12 రోజుల ముందటికీ, ఇప్పటికీ ఈ కిలోమీటరు రద్దీ వీధి ఎంతగా మారి పోయినదీ, అందుకు కారణమైన మానవ శ్రమనూ ప్రజలంతా అర్ధం చేసుకొని, అభినందించి, అనుసరించాలని వేడుకొంటున్నాను.

               ప్రతి వేకువ పాటు బడినట్లే ఈనాటి బ్రహ్మకాలపు శ్రమదానాన్నీ దగ్గరగా పరిశీలించాను, ఏ సామాజిక సంక్షేమ తత్త్వబలం ఈ స్వచ్చ కార్యకర్తలను ముందుకు నడిపిస్తున్నదో నాకు మరొక మారు బోధపడింది! ఈ నాటి 45 పని గంటల పిదప ఒకప్పటి అసభ్యకర వీధి యొక్క స్వచ్ఛ శుభ్ర సౌందర్య విశ్వరూపాన్ని ప్రయాణికులూ, గ్రామస్తులూ ఆస్వాదించాలని  ఆహ్వానిస్తున్నాను!

               ఒక పిండి జ్యోతి అనే నర్సు ముళ్ళ పూల చెట్ల పనులెందుకు చేస్తున్నదో - ఒక 86 ఏళ్ల వృద్ధ వైద్యునికి తన ఇంటికి 2 కిలో మీటర్లు చీకట్లో వచ్చి, ఊడ్చే అవసర మేమిటో ప్రజలు గ్రహిస్తే చాలనుకొంటున్నాను!

ఈ స్వచ్ఛ సుందరోద్యమానికి రావి సాయి బిందు, కొండపల్లి నుండి అజ్ఞాత వ్యక్తీకడియాల సురేష్, న్యూట్రి ఫీడ్ శ్రీధర్ వంటివారు ఎందుకింతగా ఆర్థిక సహకార మందిస్తున్నారో గ్రహిస్తున్నాను!

               6.35 వేళ భోగాది ప్రకాశరావు ననుసరించి, పిడికిళ్లు బిగించి, గ్రామ శుభ్రతకు అంకితులౌతున్న కార్యకర్తలకూ, Dr. DRK గారి ప్రశంసకు బిడియపడుతున్న ఆకుల దుర్గా ప్రసాదుకూ అభివందనలర్పిస్తున్నాను!

               రేపటి వేకువ వీధి బాధ్యతలు బందరు రోడ్డులోని SBI వద్ద ప్రారంభమగునని విన్నాను!

            గ్రామ ప్రజానీకమే!

పుష్కర కాలము ఊరిని పూజిస్తూ- కష్టిస్తూ

పునరావృతి చేసినదీ స్వచ్ఛ కార్యకర్తలే!

సచ్ఛరిత్ర లిఖించినది చల్లపల్లి గ్రామమే!

ఫలితమనుభవిస్తున్నది గ్రామ ప్రజానీకమే!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   11.03.2026