పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వదులుకుందాం.
18.3.26-బుధవారపు వీధి పారిశుద్ధ్యాలు-@3776*
సదరు పారిశుద్ధ్య బాధ్యతలు తూర్పు రామాలయ కేంద్రంగా బందరు రోడ్డులోని 200 గజాలు! తమ గ్రామ బాధ్యతలు నెరవేర్చుకున్న ధన్యులు 32+4+1=37 గురు! 32 నికర కార్యకర్తలనీ, నలుగురు దర్జీ సోదరులనీ, మరొకరు ప్రాత కార్యకర్త మొహ్మద్ జానీ అనీ గుర్తించండి.
నేను కార్యకర్తలతో కలిసేందుకు వెళ్ళినప్పుడు-24 మంది-
1) మద్యం దుకాణాల వద్దా,
2) రామాలయం వద్ద డ్రైను పనుల్లోనూ,
3) ఆలయం ఎదుటి ఖాళీ స్థలాల వ్యర్ధాలతోనూ ఎవరి పద్ధతిలో వాళ్లు కుస్తీ పడుతున్నారు.
ఆ సమయం పిదప ప్రవేశించిన ఇంకొందరు కత్తి కార్యకర్తలూ, దంతె ధారులూ కమ్యూనిస్టు బజారు దాకా వ్యాపించారు.
30+ మంది చీపుళ్లు చెలరేగుతుంటే-దంతెల గరగరలు శబ్దించుచుంటే-ఖడ్గ ప్రహారాలకు పిచ్చి మొక్కలూ, గడ్డీ నశిస్తుంటే-ఇద్దరం ప్లాస్టిక్ ఏకమాత్ర వాడక వస్తువుల్ని ఏరుతుంటే ఒక వృద్ధ ఛాయా గ్రాహకుడు శ్రమదాతల పని భంగిమల్ని ఫొటోలు తీస్తుంటే-డ్రైన్ల కార్యకర్తల బట్టలకు నల్లచారలు అంటితే-
కొందరి కూనిరాగాలతో, క్రమ్ముకొనే దుమ్ము మేఘాలతో, కోడూరి వంటి వారి అదిలింపులతో, దాసరి వైద్యుని పర్యవేక్షణతో, ఇంకా వచ్చే పోయే వాహన రద్దీలతో... అక్కడి సందడెంత గమ్మత్తుగా ఉంటుందో ఊహించండి!
రిలయన్స్ స్మార్ట్స్ ఎదుటి, కట్టెల దుకాణాల ముందటి, మూడు హోటళ్ల దగ్గరి, ద్విచక్ర వాహన విక్రయ శాలల సమీప వ్యర్థాలన్నీ తొలగిపోయి, అసలైన విశాల-శుభ్ర-సుందర బందరు మార్గం మరింత దర్శనీయంగా కనిపించడం లేదా? “అరె! మనవార్డును స్వచ్ఛ కార్య కర్తలు 2 గంటల పాటు శుభ్రపరుస్తుంటిరే! రేపటి నుండి మనం కూడ వాళ్లలో చేరిపోతే పోలా...” అనిపించదా?
తమ వంతు గ్రామ సామాజిక బాధ్యతగా విన్నకోట వెంకటేశ్వరరావు బృందం ప్లాస్టిక్ సంచుల పరిహరానికై క్రొత్త నాణ్యమైన చేసంచుల్ని పంచింది. విన్నకోట వారే నేటి ఉద్యమ నినాద ప్రకటన దారుడు.
రేపటి స్వచ్ఛంద శ్రమదానం ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు-పాగోలు పంచాయతీకి చెందిన ఈద్గా పరిసరాల్లో అని గుర్తు పెట్టుకొండి!
ఇది గదా ఒక స్తితప్రజ్ఞత-4
పదవి వెంటను పరుగు లెత్తక - కీర్తి కోసం పాకులాడక
ధనమె ధ్యేయంగా తలంపక - గ్రామ మేలుకు నడుం కట్టీ
స్వచ్చ సుందర కార్యకర్తలు సుదీర్ఘంగా ఉద్యమించిరి!
అదిగదా స్థిత ప్రజ్ఞ అంటే! అవే మరి నిష్కామకర్మలు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
18.03.2026