3780* వ రోజు .......           22-Mar-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వదులుకుందాం!

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జరిగిన 3780* వ శ్రమదానం!

ప్రారంభ, ముగింపు వేళలు- ఆదివారం(22.3.26) వేకువ 4.16-615 శ్రమదాన భాగస్వాములు 27+8+8= 43 మంది! బాగుపడి, శుభ్ర- సుందరంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తున్నది విజయా కాన్వెంట్ ప్రక్క వీధి!

వీధి పారిశుద్ధ్యం అంతకుముందు జరుగుతున్నది బందరు వీధి లో ATM ల ప్రాంతం లోనేగాని, GBR ఫౌండేషన్ వారి సముచిత వైద్యశిబిర కారణంగా, స్వచ్చకార్యకర్తలు అందుబాటులో ఉండేందుకు ఈ నారాయణ రావు నగర్ బజారుకు మారింది!

ఆస్పత్రి సిబ్బంది గాని, విద్యా సంస్థ వారుగాని కనీసం వారానికొక మారైనాకాస్త పూనుకొంటే ఈ 100 గజాల రోడ్డు సుందరీకరణకు స్వచ్చ కార్యకర్తల అవసరం లేకపోను!

ప్రభుత్వాస్పత్రి ఆవరణలో తొలి ఫోటో అనంతరం ఐదారుగురు వాలంటీర్లు వైద్య శిబిరం జరుగుతున్న విజయా కాన్వెంట్ లోకి ప్రవేశించారు.  ఆవరణను ఊడవడమూ, టేబుళ్ళూ, కుర్చీలూ సర్దడమూ మందుల పెట్టెలు మోసి, అమర్చడమూ వంటి పనులు పూర్తి చేశారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అనేక శిబిరాల వ్యవస్థాపక  నిర్వాహకుడైన గోపాళం శివన్నారాయణ డాక్టరు గారు నేటి చల్లపల్లి క్యాంపుకు రాలేకపోయారు. బొత్తిగా నడుము పట్టేసిన DRK, పద్మావతి, శంకరానంద, అశ్వినీ కుమార్ డాక్టర్లే కాక- విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్థి బృందం 8 మంది నేటి వేయి మంది

పేషంట్లకు పరీక్షలు, మందులూ నిర్వహించారు .

చల్లపల్లి ప్రజలుగాని, వైద్య శిబిర సంబంధీకులైన ఇరుగు పొరుగూళ్ల వారు గాని, ఈ వేకువ జరిగిన శ్రమదానంతో నారాయణరావు నగర్ నుండి విజయ వాడ రోడ్డు దాక శుభ్ర- సుందరంగా మారిన బాటను చూసి తీరాలి. ఎన్ని ప్లాస్టిక్ వ్యర్థాలను, ప్రాత గుడ్డలను, ఆకులలములను, దుమ్మును ఊడ్చి, ఏరి, ట్రాక్టర్ లో నింపుకొని, చెత్త కేంద్రానికి చేర్చారో - ఈ పనులన్నీ ఎవరి సుఖ సంతోషాల కోసమో ఆలోచించాలి.

70 కిలోమీటర్లు ప్రయాణించి, స్వచ్ఛ- సుందర చల్లపల్లిని సవివరంగా సందర్శించి, అటు వైద్య శిబిరంలోనూ, ఇటు శ్రమదాన కార్యక్రమంలోనూ పాల్గొనిన 8 మంది వైద్య విద్యార్థి బృందాన్ని అభినందించాలి!

స్వచ్ఛ కార్యకర్తల దైనందిన శ్రమదాన పద్దతిని దగ్గరగా పరిశీలించి, ఈ రోజువారీ తుది సమీక్షా సమావేశంలో పాల్గొని, ఫైనలియర్ విద్యార్థిని మేకల భవ్య మూడేసి మార్లు 2 రకాల గ్రామ స్వచ్ఛంద శ్రమదానోద్యమ నినాదాలు పలికి, వాజపాయ్ అనే బీహారీ బాబు హిందీలో స్వచ్ఛ కార్యకర్తల్ని మనసారా అభినందిచడం నేటి విశేషం!

రేపటి మన శ్రమదాన స్థలం ATM సెంటరు నుండి విజయవాడ రోడ్డు మధ్యనే!

గ్రామ భవితకు దీక్ష బూనుట-8

ప్రజల కోసం శ్రమించుటలో పరమతృప్తిని పొందుతారట

ఊరి క్షేమం తమ క్షేమం వేఱు కావని గ్రహించారట

హరిత సంపద, స్వచ్ఛశుభ్రత – గ్రామ భవితకు దీక్ష బూనుట

-అది గదా స్థిత ప్రజ్ఞ అంటే? అవే గద నిష్కామకర్మలు ?

- నల్లూరి రామారావు

ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

22.03.2026