పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వదులుకుందాం!
పరాభవనామ సంవత్సరం తొలి మంగళవారపు శ్రమ విశేషాలు! - @3782*
పడమటి దేశాల కాలమానమైతే-24.3.26 అన్నమాట! ప్రస్తుత వేకువ 4:10 నుండి 6.10 వరకూ వరకూ నెరవేరిన స్వచ్ఛ కార్యకర్తల వీధి పరిశుభతా సంకల్పం! 28 మంది (వీరిలో 23 మంది నికర కార్యకర్తలూ, ముగ్గురో నలుగురో పాక్షిక కాల - (part - Time) శ్రామికులు!) సంకల్పంతో బందరు వీధి కాలుష్యాల మీద వాళ్ళుపెంచుకొన్న పంతం!
సమయపాలనా నియమం కూడ సగం నెరవేరింది. పనుల ముగింపు మాత్రం 6.06 కు తెలి విజిల్ మ్రోగిన వెంటనే జరిగింది ! ప్రారంభ సమయ పాలన 4.30 కాగా - 4.10 కే వెంకటేశ్వరమ్మ, ఇందిర, బృందావన, లక్ష్మణ, ఆనందుల ఆగమనం జరిగింది..
లెక్కప్రకారం ఈ ఉదయం ATM సెంటరు నుండో పెట్రోలు బంకు వద్ద నుండో పారిశుద్ధ్యం మొదలై, అవనిగడ్డ మార్గంలోని బంకు దాక జరగాలి. కాని, నిన్నటి పనులు జరిగిన చోటు మళ్లీ దుమ్ము, ఇసుక, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు కనపడగా, సహించలేని కార్యకర్తలు పిండిమర వద్ద నుండే మళ్లీ పనులు మొదలుపెట్టారు.
ఇక అక్కడి నుండి చెప్పేదేముంది - పళ్ల, కొబ్బరి దుకాణాల, ఉభయ దేవాలయాల, ముఖ్యంగా ATM కేంద్రాలన్నిటినీ - ఊడవడమూ, చిన్న కార్ల స్టాండు వెనక 2 గుట్టల పిచ్చి చెట్ల పని పట్టడమూ, ఇసుకా - దుమ్ముల్ని ట్రాక్టరులో నింపుకోవడమూ, ఇద్దరేమో బంకు ప్రక్క సందును శుభ్రపరచడమూ.... షరామామూలుగానే జరిగిపోయినవి.
చల్లపల్లి ప్రజానీకంలో కొందరికింకా అర్థం కావడం లేదు – ఇప్పుడు తప్ప ఇకెప్పుడూ
1) నడుం పట్టేసిన ఒక స్వచ్ఛ వైద్యుడు ప్రక్కకు ఒరగబడి నడుస్తూ స్వచ్ఛ సేవలకు పూనుకోవడం గాని,
2) 78-87 ఏళ్ల సూపర్ సీనియర్లు ఎన్ని శారీరక సమస్యలున్నా తమ గ్రామ బాధ్యత తీర్చుకోవడం గానీ,
3) పాతిక ముప్పై మంది ప్రతి దినమూ తమ తొలి ప్రాధాన్యంగా ఊరి కోసం గంటన్నరకు పైగా గ్రామ వీధుల్ని, డ్రైన్లనూ బాగుచేయడం గాని...
చూడనే లేరని! ఈ సామాజిక-సామూహిక-సత్కార్యంలో పాల్లోనే అదృష్టం రాకపోవచ్చునని!
నేటి కొన్ని ముఖ్యాంశాలు:
1. నినాదాలను ప్రకటించిన నల్లూరి శ్రీనివాస్,
2. నిన్న షిరిడీ సాయి ప్రసాదం పంచిన పల్నాటి అన్నపూర్ణ,
3. సుమారు 9.00 తర్వాత MLA బుద్ద ప్రసాదు గారు NH216, గంగులవారిపాలెం వద్ద 3 మొక్కలు నాటడం,
4. సాయంత్రం 3.00 నుండి గ్రామంలోని అన్ని ప్రజా శ్రేయోదాయక సంఘాలు పాఠశాలల విద్యార్థుల్ని కలిసి మాట్లాడడం.
రేపటి వీధి బాధ్యతలు కూడ ATM సెంటరు వద్ద నుండే జరుగుతాయట!
అదే సార్ స్థిత ప్రజ్ఞ అంటే-10
డి.ఆర్.కె.తో సహాధ్యాయులు, అతనితో మిత్రాను బంధులు
తరలి వచ్చీ, చెట్లు నాటీ, మరల మరలా చూసి పోతూ
దాతలై పోతుందురంటే- బాధ్యతలు మోస్తుందురంటే
అది గదా తగు దాన ధర్మము- అదే గద నిష్కామకర్మము!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
24.03.2026