3784* వ రోజు .......           26-Mar-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

33 మందితో జరిగిన 3784* వ వీధి బాధ్యతలు!

               గురువారం - 26.3.26 వ వేకువ గ్రామ 3 రోడ్ల కూడలిలో  4.18 కు ప్రారంభమైన ఆ బాధ్యతలు 6.07 కు కొందరూ, 6.12 కు మిగిలిన వారూ పని విరమించగా, 6.25 కు జరిగిన సమీక్షా సమావేశంతో ముగిసినవి.

               ఐతే వారి పనులు కేవలం కోట సెంటరు కే పరిమితం కాలేదు, మరొకమారు-బహుశా 3 వ పర్యాయమనుకొంటా-బందరు వీధిలోని స్వచ్ఛ సుందర పబ్లిక్ టాయిలెట్ల వద్ద మళ్లీ పడిన ఇసుకనూ-దుమ్మునూ ఊడవడంతో మొదలై,

               నిన్నటి మన వాట్సాప్ సందేశం చదవని ముగ్గురు విజయవాడ బాటకు బదులు అవనిగడ్డ మార్గంలోని బంకు వైపు శుభ్రపరచగా,

               సెంటరుకు తూర్పుగా దుకాణ సముదాయమూ, ఇండియన్ బ్యాంకూ, వినాయకుని గుడి, కూల్ డ్రింకు షాపుల ప్రాంతాల్ని డజను మంది వరుసగా 3 వ రోజు శుభ్రపరిచారు.

               3 రోడ్ల కూడలి కైవారాన్ని పట్టిపట్టి అద్దంలా బాగు చేసిన 10 మందీ విజయవాడ రోడ్డును 40 నిముషాల పాటు అగ్రహారం వీధి దాకా బాగు చేశారు.

               “రోడ్లు శుభ్రంగానూ, అందంగానూ ఉన్నాయే! మళ్లీ వీళ్లు మూడేసి  మార్లు ఊడ్చి, దుమ్ము ఎత్తడమేమిటి- చాదస్తంగా” అని  ప్రజలకనిపించవచ్చు గాని, అలా అనిపించే వాళ్లు అప్పుడప్పుడైనా స్వచ్ఛ కార్యకర్తలుగా మారితేగాని అర్ధం గాదు-స్వచ్ఛ కార్యకర్తల ఆంతర్యమేమిటో!

               ఈ వేకువ వాలంటీర్లెవరూ మురుగు కాల్వల జోలికి పోలేదు. ముగ్గురికి తప్ప కత్తుల అవసరమూ రాలేదు,

               ఐతే చాలమందికి లోపల చిరాకుగా, అసహనంగా, బాధగా ఉన్నది-3 రోడ్ల కూడలిలో వెలసిన భారీ ప్లాస్టిక్ ఫ్లెక్సిలను చూస్తూ పనులు చేయడంలో!

               నేటి స్వచ్చోద్యమ నినాదాల అవకాశం ఆకుల దుర్గా ప్రసాదు గారిది!

               2 గంటల శ్రమలతో తళతళలాడే 200 గజాల వీధుల్ని సమీక్షించి,

1) రామ్ చరణ్ అభిమానులు వారి పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ సంస్ధ కు రక్తదానం చేసే శిబిరం రేపు గంగులవారిపాలెం వీధిలో నిర్వహింపబడుననీ,

2) సోమవారం నాటి రాజ్ గర్నెపూడి (USA), కాట్రగడ్డ అజయ్ (బెజవాడ) ల పర్యటనను గుర్తు చేసి,

3) రేపటి శ్రమదానం కొరకు అగ్రహారం వీధి (విజయా డైరీ) వద్ద కలవాని గుర్తు చేసిన పని నాది.

            శంకరుండో-  ప్రేమానందుడొ-12

చల్లపల్లికి చెందనట్టి సగం పైగా కార్యకర్తలు-

శంకరుండో-  ప్రేమానందుడొ అంజయ్యాదులు ఎందరెందరొ

శ్రమను, మేధను ఊరికోసం ధార పోయుట తలచుకొంటే

అదే మరి నిష్కామకర్మము! అదే మరి ఒక స్థిత ప్రజ్ఞత!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   26.03.2026