3785* వ రోజు .......           27-Mar-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

 అంతులేని స్వచ్చోద్యమ చరిత్రలో ఇది 3785*వ పుట!

2 గంటలపాటు ఆ పేజీని తమ శ్రమతో లిఖించిన కార్య కర్తలు 31 మంది ; ఈ చారిత్రక సంఘటనా స్థలం బెజవాడ రోడ్డులోని అగ్రహార ప్రాంతం; సమయం వేకువ 4.15-6.10 శుక్రవారం - శ్రీరామనవమి పర్వదినం – 27.3.2026!

జై స్వచ్చ చల్లపల్లి వాట్సాప్ సైన్యం” క్రొత్త పాఠకులకైతే- "ఆ ( ! ఏదో 30 మంది స్వచ్ఛ సైనికులనే పేరుతో 150 గజాల వీధిని - కోట ఉత్తరపు ప్రహరీ బారునా 2 గంటల పాటు కొందరూ, గంటకు పైగా మరి కొందరూ, దుమ్మూ+ ఇసుకా ఊడ్చి, షాపుల - టీ దుకాణాల - టిఫిన్ సెంటర్ల- బార్బర్ షాపుల- మెకానిక్ షాపుల - అన్ని రకాల వ్యర్థాలనూ తుడిచి, ట్రాక్టర్లోకి ఎత్తిన మాట నిజమేగాని - మరీ ఇంతగా ఇదేదో ఘన చరిత్ర అంటూ పొగడు కోవాలా?" అనిపించ వచ్చు !

అప్పుడప్పుడూ చదివే వాళ్లకు కాస్త సత్కాలక్షేపంగానూ ఉండవచ్చు ! తమ దైనందిన శ్రమదానాన్నీ, తత్పరిణామాన్నీ యధాతథంగా వ్రాస్తున్న ఈ రోజువారీ వ్యాసాలను క్రమం  తప్పక చదివే స్వచ్చకార్యకర్తలకు ఆసక్తిదాయకంగా ఉండ వచ్చును!

ఒక 71 ఏళ్ల భారీ  ముసలి కార్యకర్త పంచాయతి ఆఫీసు వెనుక ప్రహ రీలోని రావి మొక్కల్ని ఎంత కష్టపడి తొలగించి, ప్రజల ఆస్తిని రక్షించిందీ వ్రాస్తే-

ఒక పోస్టల్ ఉద్యోగి ప్రహరీ గోడ దూకి లోపల శుభ్రపరిచిన సంగతి వివరిస్తే-

ఏడెనమండుగురు లోడింగు బ్యాచి “ ఇంకొక్క 5 నిముషాలు విజిల్ ఊదవద్దు " అని నన్ను కోరితే-

ఈ చర్యల స్ఫూర్తి ఏమిటో తమ గ్రామం పట్ల వాళ్ల అభినివేశమేమిటో- చదువరులెవరైనా అర్థం చేసుకోవచ్చును!

వెంకటాపురం పాఠశాల చిరంజీవులు విస్మిత, రాకేష్ లు సంయుక్తంగా ప్రకటించిన స్వచ్చోద్యమ నినాదాలూ,

నిన్నటి తిరుపతి పుణ్య క్షేత్ర యాత్రికులు BSNL - కస్తూరి లడ్డూ  ప్రసాదమూ,

గంగుల వారిపాలెం పరిధిలో నేటి రెడ్ క్రాస్ వారి రక్తదాన శిబిరమూ,

 రేపటి శ్రమదానం బెజవాడ రోడ్డు నందలి శివాలయం నుండి మొదలగుననే సందేశమూ ఈనాటి తుది సభా సంగతులు!

ఇదేలే స్థిత ప్రజ్ఞ అంటే – 13

శ్రమకు తోడుగ మేధనూ, తమ ధనం సైతం సమర్పిస్తూ

వైద్యులూ, టీచర్లు, రైతులు,  వణి క్ప్రముఖులు, వృద్ధమూర్తులు

వేల నాళ్లుగ గమిస్తుండుట - వివిధ రూపుల క్రమిస్తుండుట

ఇదేలే స్థిత ప్రజ్ఞ అంటే! ఇదేలే నిష్కామ కర్మము!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   27.03.2026