3786* వ రోజు .......           28-Mar-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

28.3.26 - వారంతపు గ్రామ శుభ్రతలు - @3786*

               వాటిని సాధించిన కార్యకర్తల స్కోరు 38, వారి చెమటలు చిందినది బెజవాడ బాటలో అగ్రహారం తొలి వీధి మొదలు 4 వ వీధి దాక – సుమారు 160 గజాలు.

                ఐతే, ఇందులో కొంతభాగం నిన్న శుభ్రపడినదే – కానిఈ 24 గంటల్లో అక్కడ చేరిన కొంత చెత్త, దుమ్మూ, నిన్న లోడు చేయక వదిలిన ఇసుక - దుమ్ము గుట్టల వల్ల ఈ పూట కూడ 10 మందికి బాట ఉత్తర మలుపు దాక పనులు దొరికాయి!

               మలుపు వద్ద గాయత్రి బ్రాహ్మణ కర్మల సత్రము వద్దే అసలైన చెత్త - చెదారపు డంపు! అక్కడ డజను మందికి గంటకు పైగా పని! ఫ్లెక్సీల మాటున కూడ రకరకాల కాలుష్యాలు! గోతాం నిండుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్కులూ, అరగోతాం గాజు వస్తువులూ అక్కడే దొరికాయి!

               అక్కడి టీ కాఫీ దుకాణం వద్ద మాత్రం గతంలో వలె దట్టంగా వ్యర్ధాలు లేకపోవడం సంతోషదాయకం. ఐతే - దాని ఎదుట - పంచాయతి అడ్డరోడ్డు దగ్గరి డ్రైను మాత్రం ఘాటు కంపులు చిమ్ముతున్నది.

               8 మంది కార్యకర్తలు శ్రీమంతు క్లబ్బు వద్దా,

               5 గురు కస్తూరమ్మ గార్డెన్ ప్రదేశాన్నీ,

               మిగిలిన వారు బెజవాడ బాటలో అగ్రహారం 4 వ లైను దాక ఊడ్చారు. మొక్కల్ని ట్రిమ్ చేశారు, గడ్డీ, పిచ్చి మొక్కల్ని దునుమాడారు.

               బస్ షెల్టరు ముందు గాని, మెకానిక్ షెడ్ల ఎదుట గాని, సిమెంటు విక్రయ సంస్థ బారునా గాని ఇప్పుడిక స్వచ్ఛ పరిశుభ్రతలకు లోటు లేదు, ప్లాస్టిక్ లు, కాగితపు ముక్కలు ఇప్పుడక్కడ కనిపించవు. మినీ ఉద్యానాలు గాని, వారం రోజులుగా జరుగుతున్న శ్రమదానంతో ఈ 2 కిలోమీటర్ల బందరు - బెజవాడ వీధులు గాని చూస్తుంటే - చల్లపల్లి స్వచ్ఛ సుందరీకరణ ఉద్యమాశయం నెరవేరిందనే అనిపిస్తున్నది!

               శివాలయం ఎదుట అడపావారిపాలేనికి చెందిన పండలనేని శ్రీ కనకదుర్గ స్పష్టపరచిన శ్రమదానోద్యమ నినాదాలను అందరూ అందిపుచ్చుకొన్నారు,

               రేపటి వేకువ తమ ఊరి బాధ్యతల కోసం VJA రోడ్డులోని శ్రీ మంతు క్లబ్బు ప్రక్క వీధి వద్ద కలవాలని నిశ్చయించుకొన్నారు!

               అందుకే అవి స్థిత ప్రజ్ఞలు – 14

జయించ వచ్చును బైటి శత్రుల, దాన ధర్మాల్ కూడ నిజమే

ఒక్క పూటో- ఒక్క వారమొ ఊరి కర్పించుటయు సాధ్యమె

కాని పదకొండేళ్లుగా నిస్వార్థ పూరిత గ్రామ సేవలు -

అందుకే అవి స్థిత ప్రజ్ఞలు – అవే మరి నిష్కామ కర్మలు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   28.03.2026