3787* వ రోజు .......           29-Mar-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

ఆదివారం (29-3.26) నాటి పనిదినం 3787* వది. 

గ్రామ వీధి శుద్ధికారులైతే 47 గురు; వారి శ్రమకు నోచుకొన్న చోటు బెజవాడ బాటలోని శివాలయం మొదలు బైపాస్ మార్గం దాక.

పని ప్రారంభ ముగింపులు వేకువ 4.15-6.10.

 ఇంకొంచెం వివరాల్లోకి వెళితే-

- పది మందికి పైగా కార్యకర్తలు కర్మల భవనం నుండి HDFC  బ్యాంకు దాక గూళ్లరిగేంతగా, చీపుళ్ళు విరిగేంతగా ఊడుస్తూనే ఉన్నారు.

- రోడ్డు మీది గుంటల్లోని దుమ్మూ - ఇసుకా వాళ్ళ పని వేగాన్ని తగ్గించాయి.

- 5.15 సమయంలో ముగ్గురికి  శ్రీమంతు క్లబ్ ఎదుటి ఉద్యానంలో  నిన్న చేసిన శుభ్రతలో లోపం కనిపించగా అప్పటికప్పుడు చీపుళ్లు,  డిప్పలు తీసుకొని మరోమారు ఊడ్చి,  ఆకుల్ని ఎత్తి వేశారు.

- క్లబ్బు వీధిలో ఒక వృద్ధురాలు DRK డాక్టరు గారు కనిపించరేమి? అని ఆరా తీసింది.

- కార్యకర్తల కష్టం ఎలా ఉంటుందో క్రొత్తవాళ్లు తెలుసుకోవాలంటే రోడ్డుకు తూర్పున మెకానిక్ షెడ్ల ప్రక్క డ్రైను వద్ద జరిగిన 15 మంది పనినే చూ డాలి. అక్కడి వ్యర్థాను పెద్ద గుట్ట నుండి విడగొట్టి, మట్టిని ప్రోగు పెట్టడాన్ని పరిశీలించాలి.

- బాట కు పడమటి మార్జిన్లోగాని, బుల్లి ఉద్యానాల్లో గాని 15 మంది ఎంత శ్రద్ధగా గంటన్నర పాటు కత్తులతో చీపుళ్లతో- దంతెలతో పని చేసుకుపోతున్నారో చూస్తేగాని “స్వచ్ఛ సుందర చల్లపల్లి” ఉద్య మాశయమేంటో తెలియదు.

- అలా సుమారు 2 గంటల శ్రమానంతరం -  చెత్త గుట్టల్ని  పంచాయతి కార్మిక సోదరులకు వదిలేసి, బండిన్నర దుమ్మూ ఇసుకల్ని  అవసరాన్ని బట్టి కావలసిన చోటికి తరలించి, కాఫీలు సేవించి, కొద్ది పాటి సరస సల్లాపాలు ముగించి,

రాయపాటి రమ గారి స్వచ్చోద్యమ  నినాదాలకు స్పందించి,రాధాకృష్ణ దంపతుల 10,000 /- విరాళాన్ని ట్రస్టు తరపున నేను కృతజ్ఞతల తో స్వీకరించి,

 రేపటి మన పనిస్థలం బైపాస్ వీధి మొదట్లో HDFC బ్యాంక్ వద్ద  నుండి అని నిర్ణయించి, నేటి కార్యక్రమం పూర్తి చేశారు.

రాజ్ గర్నెపాటి, అజయ్ కాట్రగడ్డ గారలు రేపు చల్లపల్లికి వస్తున్నారట!

ఏవి స్వామీ స్థిత ప్రజ్ఞలు – 15

టెస్టు మ్యాచుల వేల పరుగులు, ట్వంటీ-20 సెంచరీలూ

సినీమా ఒట్టొట్టి ఫైటులు.... ఇవా నిజమైన ఘనతలు?

స్వార్ధమును లోతుగా పాతిన పదీ-పద కొండేళ్ళసేవల?

ఏవి సార్ నిష్కామ కర్మలు ? ఏవి స్వామీ స్థిత ప్రజ్ఞలు?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   29.03.2026