3792* వ రోజు .......           03-Apr-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేస్తే మంచిది.

 శుక్రవారం (3.4.26)  పని దినం సంఖ్య - @ 3800- 8*

గ్రామం కోసం కష్టించే వాళ్ల అంకె మాత్రం కొంత తగ్గి, 28 గా నిలిచింది, పని వేళల్లో మార్పు లేదు – వేకువ 4.16 – 6.06, శ్రమ జరిగినది బెజవాడ మార్గమందలి NTR పార్క్ నుండి వికాస కేంద్రం నడుమ, తుది సమావేశ స్తలం పెట్రోలు బంకు ఆవరణే! పాల్గొన్నదీ, దాన్ని ముగించినదీ స్వల్ప అస్వస్తతానంతరం Dr. DRK ప్రసాదు గారే.

ఈ సమాచారాన్నే కాస్త వివరంగా చెప్పాలంటే:  

1) నేటి గంటన్నర పైగా జరిగిన శ్రమదానం 3 చోట్ల – 4 రకాలుగా జరిగింది- NTR పార్కు చిన్నగేటు ప్రక్క డ్రైను గట్టులూ, బంకు తూర్పున వీధి శుభ్రతా, మూతబడిన వడ్లమర ప్రక్క సందూ,

చండ్ర వికాస కేంద్రం దాక ఊడుపూ, చెత్తల లోడింగూ,

 2 ) ఈ పూట కూడ 2 డ్రైన్ల నుండి, వాటి గట్ల నుండీ 2 సంచుల ప్లాస్టిక్ లూ,  గాజు బుడ్లూ  దొరికాయి!

3 ) ‘అలీ మెకానిక్’  బోర్డు వద్ద 2 సెంట్ల చోటు 5 గురి ప్రయత్నంతో బాగుపడింది.

4) ఐదుగురు చీపుళ్ళతో బంకు నుండి వికాస కేంద్రం దాక ఊడుస్తునే ఉన్నారు.

5) ఒక వెంకటేశ్వరరావు డిప్పల కొద్దీ ఇసుక- దుమ్మూ మిశ్రాన్ని ఎత్తి మోసి, రోడ్డు మార్జిన్ గుంటను పూడ్చగా, చివరికి 6.04 కు తొలి విజిల్ వినిపించింది.

కాషాయ వస్త్రాల సాధువు కాబోలు “అన్నా! ఒక సందేహం - చాల రోజుల్నుండి చూస్తున్నాను. ఈ వేకువ పనులకు మీకు ఎంత కూలి గిట్టుతున్నది?” అని నన్ను ప్రశ్నించాడు.

ఇద్దరు కార్యకర్తలు తాము అద్దంలా శుభ్రపరచిన చోటును చూపి, “మా  కృషికి ఎన్ని మార్కులొస్తాయి?” అని ప్రశ్నించారు. వందకు వంద వేసినా చాలవనీ, ఆ సామాజిక స్ఫూర్తి వెలకట్టరానిదనీ లోలోపల అనుకొన్నాను!

- అంతకు ముందు అనుభవంలో లేని క్రొత్త వింత,  తల, ఛాతి నొప్పి వచ్చినపుడు ఆశ్రద్ధ పనికిరాదనీ, ఈ నాటి వైద్యం ఖర్చు భరించరాని భారమనీ స్వానుభవాన్ని DRK గారు పంచుకొన్నారు .

- తూము వెంకటేశ్వరరావు నినాద లాంఛనం పూర్తిచేశారు.

- స్వచ్చ-సుందరోద్యమ  శ్రమదాన చరిత్ర పుస్తకాలను కార్యకర్తలందుకొన్నారు.

క్రొత్త ఆర్ధిక సంవత్సరం లో మనకోసం మనం ట్రస్టుకు ప్రాతూరి శంకర శాస్త్రి గారి చెక్కు రూపంలో విరాళం మేనేజింగ్ ట్రస్టీ గారికి అందినది.

 

రేపటి శ్రమదానం చండ్ర వికాస కేంద్రం వద్దనని నిర్ణయించారు.

స్థిత ప్రజ్ఞకు ఉదాహరణలు-20

స్థిత ప్రజ్ఞకు ఉదాహరణలు ఎన్నయిన చూపించ వచ్చును

ఇది పొగడ్తని-మెచ్చుకోలని ఎవ్వరూ భావించకూడదు

చాతనైతే సహకరించీ- శ్రమోద్యమమును ప్రోత్సహించీ

సమాజంలో ఆదరాన్నీ గౌరవాన్నీ పొంద వచ్చును!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   03.04.2026