3793* వ రోజు .......           04-Apr-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేస్తే మంచిది.

          ఏప్రియల్- 2026 – తొలి వారాంతపు శ్రమదానం!@3800-7*

దానికి 18 మంది కార్యకర్తలతో 4.30 కు బదులు 4.16 కే శ్రీకారం!

 తరువాత క్రమంగా మరో 34 మంది వాలంటీర్ల ప్రవేశం ! తెనాలి వాస్తవ్యుడూ, విశాఖ నివాసితుడూ, సివిల్ ఇంజనీరుడూ, అనిల్ కుమార నామధేయుడూ ఐన ఒక ఆగంతకుడు 5.40 కి ఒక వివాహ వేడుకకు వచ్చి, శ్రమదాతలతో మమేకం!

సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కావడంతో – తాను వచ్చిన  పని కాస్త ప్రక్కన పెట్టి, 12 ఏళ్లుగా జరుగుతున్న చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమాన్ని ½  గంట పాటు పరిశీలించి, ఆశ్చర్యానందాలతో ఫోటోలూ, వీడియోలూ తీసుకొని, ఇలాంటి కార్యక్రమం తాను కూడ మొదలు పెడతాననే ప్రకటనం!

ఇలాంటి సంఘటనలు గత 13 ఏళ్లలో అప్పడప్పుడూ జరుగుతూనే ఉన్నవి. చల్లపల్లి శ్రమదానోద్యమంలో శంకర శాస్త్రి గారి ప్రవేశమూ ఇలాంటిదే!

మరి ఇందరు సముచిత శ్రమదాతలు సుమారు రెండేసి గంటల పాటు- మొత్తం మీద 50 - 60 పని గంటలు ఆయిల్ నిల్వ కేంద్రం నుండి

1) విద్యుత్ సబ్ స్టేషన్ మీదుగా, చండ్ర వారి వికాస కేంద్రం దాటి,

2) అటుగా రైస్ మిల్లర్స్ భవనం దాక ఏం సాధించినట్లు - అంటే

 2 గోతాల గాజు, ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర ఏకమాత్ర ప్రయోజనకర -  పర్యావరణ హానికర ప్లాస్టిక్ తుక్కులూ,

- బండెడు రకరకాల చెత్తలూ,

- అర బండెడు ఇసుకా – దుమ్మూ,

- బాటకు తూర్పు డ్రైను మురుగుకు కాస్త నడక నేర్పూ,

- గత కాలపు వడ్లమర ఎదుటి గుంటల చదునూ,

- కొన్ని చెట్ల సుందరీకరణమూ,

- వికాస కేంద్రం ప్రక్క డ్రైను గట్టు మీద జాస్తి ప్రసాదుని ఒంటరి పోరాటమూ వగైరాలన్నమాట!

ఈ చర్యల మూలంగా కార్యకర్తలు ఎప్పటి లాగే పొందిన సంతృప్తి సరేసరి !

 వికాస కేంద్రంలో జరిగిన తుది సమావేశాన్ని తన నినాదాలతో ప్రారంభించినది శ్రీమతి దాసరి స్నేహ,

శ్రమదాన చరిత్రలను కారకర్తలకు పంచినది బృందావనుడు,

ఈ  మధ్యాహ్నం వాసవీ కల్యాణ మండపంలో యార్లగడ్డ వంశీకుల వివాహ వేడుకను గుర్తు చేసింది నేను,

రేపటి శ్రమ వేడుక ప్రారంభ స్తలం చండ్ర వికాస కేంద్రమనేది అందరి నిర్ణయం!

                   చల్లపల్లే ఉదాహరణము!

వేలకొద్దీ చెట్ల నీడలు, లక్షలాదిగ పూల జాడలు

పరిశుభ్ర సుందరముగా వీధులు, ప్రశాంతంగా జనుల మనసులు

త్యాగ బుద్ధితో గ్రామ వాసులు, సుఖస్వస్తత రాజ్యమేలే

గ్రామమే ఆదర్శ గ్రామము- చల్లపల్లే ఉదాహరణము!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   04.04.2026