3794* వ రోజు .......           05-Apr-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

3800-6* వ నాటి పారిశుద్ధ్య నిర్వహణ!

 ఆదివారం (5.4.26) వేకువ సమయంలో 14 మంది4.15 కే బెజవాడ రోడ్డులోని చండ్ర వికాస కేంద్రం వద్ద అందుకు సంసిద్ధులయ్యారు. వాళ్ళు కాక మరో 28 మంది- అంటే బృంద బలం 42 అన్నమాట -6.11 వరకూ 3 చోట్ల నెరపిన శ్రమ విశేషాలకు నేను సాక్షిని!

వాటిలో మొదటి ది 7 గురు దుర్వాసనను పీలుస్తూ స్వచ్ఛ టాయిలెట్ల వెలుపలి  డ్రైనులోనూ, గట్టు మీదా జాగ్రత్తగా ఏరిన – కోసిన- ఎత్తి ట్రాక్టరులో నింపిన ప్లాస్టిక్ వస్తువులూ, గడ్డీ వగైరాలు!

రెండవది కోమలా నగర్ తొలి వీధిలోనూ, 2 డ్రైన్ల వద్దా 6 గురు  నిర్వహించిన పారిశుద్ధ్యం!

3వ విశేషం వికాస కేంద్రం బైట రోడ్డు మార్జిన్ల సుందరీకరణమూ, కొన్ని చెట్ల ట్రిమ్మింగూ, డ్రైను వ్యర్థాల   తొలగింపూ!  

ఇవి కాక 200 గజాల రోడ్డు బారునా చీపుళ్ల విభాగం వారు శక్తివంచన లేకుండా ఊడ్చిన, వ్యర్థాల – దుమ్మూ, ఇసుక మిశ్రాల గుట్టలు!

వీటన్నిటినీ చివరి అరగంటలో చకచకా ఎత్తి ట్రాక్టరు నింపిన లోడింగు పని 4 వది !

షరా ! ఇవన్నీ గత 12  ఏళ్ళుగా చల్లపల్లిలో జరుగుతున్నవే- విసుగూ విరామం లేక తమ చల్లపల్లిని రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిలిపేందుకు కార్యకర్తల నిత్య కృత్యాలే!  కాకపోతే – అవి నా కంటి కెప్పుడూ వినూత్న సేవలే! మనసుకెప్పుడూ ఆశ్చర్య- ఆనంద కారకములే!

“అరె! ఇంత మురికి – చెత్త పనులు పట్ల ఇందరు కార్యకర్తలకు ఇంత నిబద్ధత ఏమిటిరా” అని ప్రశ్నార్థకాలే!

కొంత అస్వస్తతతో 4 నెలలుగా వీధి బాధ్యతలు పంచుకోలేని గోళ్ళ వెంకట రత్నం గారు ఈ పూట పునరంకితుడై, 6.15 కు చండ్ర వారి వికాస కేంద్రంలో జరిగిన తుది సభను నినాదాలతో ప్రారంభించగా-

ఇందరి శ్రమదానానికి జోహారులర్పించి,

- రేపటి తమ పని పార్రంభం ఆకుల దుర్గా ప్రసాదు వ్యాపార కేంద్రం నుండే అని కొందరం నిర్ణయించగా,

నిన్న సాయంత్రం స్వర్గస్తుడైన మన కార్యకర్త గుత్తికొండ కోటేశ్వరరావు గారికి తుది వీడ్కోలు పలికి, అందరూ ఇళ్లు చేరుకొనిరి !

               స్వప్నములు అందరికి వస్తవి

స్వప్నములు అందరికి వస్తవి, సదూహలు అందరికి తడుతవి

ఉన్న ఊరును ఉద్దరించుట కుత్సహింతురు చాలమందే

కాని - అవి మూన్నాళ్ళ ముచ్చటగా ముగించడమే రివాజు

ఒకే ఒక్కటి- చల్లపల్లే  ఉన్నదపవాదముగ అందుకు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   05.04.2026