3796* వ రోజు .......           07-Apr-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు. 

మంగళవారం – 3796* వ శ్రమదానం(7.4.26) వివరాలు !

 నేటి 25+4 = 29 మంది కార్యకర్తల గ్రామ వీధి ముమ్మర ప్రయత్నాలు 2 చోట్ల- 2 రకాలుగా జరిగెను! ఇందులో తొలి బృందం నిన్నటి నిర్ణయానుసారం బెజవాడ రోడ్డులోని విజయా అకాడమీ ప్రాంతంలో  శ్రమించగా, రెస్క్యూ బృందంగా గుర్తించబడిన 2 వ టీము అక్కడికి 3 కిలో మీటర్ల దూరంగా - గంగులవారి పాలెం సమీపంగా బండ్రేవు కోడు కాల్వ వంతెన మలుపులో చెమటను చిందించెను!

మొదటి 24 మంది కూడ కేవలం బెజవాడ బాటకే పరిమితం కాక,  కస్తుర్బా ప్రభుత్వాస్పత్రి వీధిలో కూడ వ్రేలు పెట్టిరి. రోడ్డుకు పడమరగా ఒక ప్రైవేటు 3-4 సెంట్ల స్థలం అంద విహీనంగా కనిపించుటచే ఐదారుగురు ఆ శుభ్ర సుందరీకరణలను పూర్తిగావించిరి ! అచ్చట 15- 20 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు  కూడ  దొరికినవి!

బాటకు తూర్పున వికాస కేంద్రం చిన్నగేటు ప్రాంతంలో చెట్ల అందాలకు మెరుగులు దిద్దిన-  డ్రైను గట్లను 3 వ విడత శుభ్రపరచిన గట్టి ప్రయత్నం కోడూరు -అంబటి -పల్నాటి త్రయానిది!

నారాయణరావు నగర్ దారి మొదట్లో మాత్రం డ్రైన్ నుండీ, చిరు చిరు హోటళ్ల పరిసరాల నుండీ7-8 మంది ప్రోగు చేసిన వ్యర్థాలు మాత్రం తక్కువా?

విజయా కాన్వెంట్ వద్ద నలుగురు పనిచేయు చుండగా వచ్చిన SBI మాజీ మేనేజర్ పృధ్వీశ్వర రావు గారు వచ్చీ రావడంతోనే చీపురందు కొనిరి!  నేటి శ్రమదానోద్యమ నినాద లాంఛనం కూడ వారిదే!

2 చోట్ల వేచి ఉన్న RTC బస్ ప్రయాణికులు ఈ స్వచ్చ కార్యకర్తల శ్రమనూ, మురికీ –దుమ్మూ- పనుల్నీ  కాస్త వింతగా, కొంచెం గౌరవంగా చూసిరి గాని, ఈ వేళగాని, రేపటి నుండి కాని స్వచ్చంద శ్రమదానమున పాల్గొందురను నమ్మకము కల్గించలేదు!

 

రెస్క్యూ టీమ్ వారు JCB సాయంతో చేసిన బరువు పనుల్ని ప్రత్యక్షంగా చూడ లేకపోతిని!

“హరిత వేడుకలు  బెజవాడలోను, నాగాయలంక లోనూ జరుగుటలో తన పాత్ర కొంత కలదు” అని పృధ్వీశ్వర రావు గారు, వాటిని గురించి  నిరంతరంగా మనం  ప్రయత్నించాలని DRK గారు వివరించిరి.

మన రేపటి శ్రమ బాధ్యత కూడ విజయా కాన్వెంట్ పరిసరాల లోనే అని నిర్ణయించిరి!

                     సెంచరీలు బాదే తపస్సు మాది!

“ సెంచరీలు కొట్టే తపస్సు మాది- డ్రైన్లు బాగు చేసే హవిస్సు మాది”

        రోడ్లు ఊడ్చి శుభ్రపరచు రోత పనులె ఇష్టం!

       ప్రజారోగ్య ప్రయత్నాలు మేము మానుకోం!

      అవి లేకిక మాకు నిద్ర పట్టదనుట రహస్యం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   07.04.2026