3797* వ రోజు .......           08-Apr-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

3800* పని దినాలకు దగ్గరగా –@3797*

               ఈ బుధవారం(8-4-26) 27 మంది శ్రమదానం ఆ ప్రతిష్టాత్మక సంఖ్యకు మరింత చేరువయింది. నేటి వీధి పారిశుద్ధ్య/ సుందరీకరణ చర్యలు కూడ మరొక పర్యాయం బెజవాడ మార్గంలోని విజయాకాన్వెంట్ వద్దనే మొదలై, మళ్లీ వికాస కేంద్రం దిశగా సగం మంది అడుగులేశారు!

               మిగిలిన సగం మందీ ప్రభుత్వాసుపత్రి వీధి అందచందాలకు పూనుకొన్నారు. నన్ను ఆశ్చర్యపరచిన దృశ్యమేమంటే – చిన్న హోటల్, ఆ ప్రక్క దుకాణం ముందు నిన్నా - మొన్నా దొరికిన వ్యర్ధాలు కాక ఈ పూట అంత పెద్ద ప్రోగు ఎలా తయారయిందా అని! బహుశా ఏ కార్యకర్తో ఆ రెండిటి వెనక దాగిన ఈ వ్యర్ధాలను కనిపెట్టి ఉండొచ్చు!

               మార్చి నెలలో వైద్య శిబిరం జరిగిన నాడు శుభ్రపడిన విజయా కాన్వెంట్ ప్రక్క వీధి శుభ్రత, అందమూ ఇంతలోనే లోపించినవని కనిపెట్టిన డజను మంది కార్యకర్తలు రకరకాల పనిముట్లతో గంటసేపు ప్రయత్నించారు గాని, ఆ ప్రయత్నం వీధి సగం దాక కూడ సాగలేదు.

               ఉత్తరపు డ్రైన్ వ్యర్ధాలూ, దక్షిణపు చెట్ల కొమ్మలు కరెంటు తీగల్లో చొరబడడమే ఆలస్యానికి కారణం కావచ్చు. ఆ కాస్త పాతిక గజాల్లోనే సగం ట్రాక్టరు చెత్తతో నిండింది చూశారా?

               స్వచ్ఛ కార్యకర్తల కఠోర గ్రామ సేవా దీక్షకు నాకీపూట 3 తాజా ఉదాహరణలు కనిపించాయి.

1) ఘంటశాల నుండి బండి మీద వస్తున్న గాయక కార్యకర్త కరెంటు తీగ అడ్డుపడి క్రింద పడినా, తన వేకువ బాధ్యతకు రావడమూ,

2) తాటాకుల పందిరి వేస్తూ నడుం పట్టేసిన మరో కార్యకర్త ఆ నొప్పితోనే వచ్చి, వీధి పనులకు పూనుకోవడమూ,

3) మరరంపం బరువు పనుల కార్యకర్త పట్టు తప్పి రెండు మార్లు క్రింద పడినా క్షణాల్లో తేరుకొని పనులు పూర్తి చేయడమూ!

               నేటి సమీక్షా సభ ఆస్పత్రి నర్సు చిట్టూరి లక్ష్మి నినాదాలతో ప్రారంభమై,

               నేటి నెలవారీ విరాళాలు

               1. కోడూరు వెంకటేశ్వరరావు – 520/-,

               2. మాలెంపాటి గోపాలకృష్ణయ్య 2000/- అందాక 6.25 కు ముగిసింది.

               ముఖ్య గమనిక : రేపటి మన వీధి పారిశుద్ధ్యం ప్రొద్దున అనుకున్నట్లు కాక - పాగోలు బాటలోని NTR హైస్కూలు వద్దకు మారింది.

 

            “సెంచరీలు కొట్టే తపస్సు మాది”

ముప్పది వేలకు పైగా మొక్కలు నాటి పెంచుతాం

బస్టాండో – శ్మశానమో బాగు పరుస్తుంటాం

ప్లాస్టిక్ దరిద్రాల మీద పళ్ళు కొరుకుతుంటాం

ఇవె మా బలహీనతలంటే – ఇదుగొ – ఒప్పుకుంటాం.

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   08.04.2026