3799* వ రోజు .......           10-Apr-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

మళ్లీ పాగోలు రోడ్డుకే అంకితమైన 2 డజన్ల మంది పనులు -@3799*

               రహదారి బాధ్యతలు ఎక్కువగానూ, సామాజిక సేవకులు తక్కువగాను ఉన్న శుక్రవారం (10.4.26) నాటి విషయాలివి!

               అక్కడికీ శివరామపురం, పాగోలు గ్రామాల వారైన మల్లంపాటి, దుర్గా ప్రసాదులిద్దరి రాకతో ఈ 2 డజన్ల మందైన – NTR పాఠశాల ప్రాంతంలో గంటన్నర చొప్పున కష్టించారు కనుక ఈ 100 గజాల బాటైనా శుభ్రపడింది.

               దివంగత రామబ్రహ్మం గారు లేని లోటు ఈ ప్రాంతంలో తెలుస్తూనే ఉన్నది. తమ ఇళ్ల దగ్గర ఎక్కడెక్కడ వారో వచ్చి, పని చేస్తుంటే - చందమామ అపార్ట్మెంట్ల – ఆ దగ్గరి ఇళ్ళ వారు మొహమాటానికైనా వచ్చి పాల్గొనవచ్చునే! NTR ఉన్నత పాఠశాల వారికైనా సదరు ఆలోచన రావచ్చునే! మార్నింగ్ వాకింగ్ దారుల్లో ఎవరైనా ఆగి సహకరించ వచ్చునే, కార్యకర్తలీ మాత్రం ఆశించడం తప్పు కాదే!

               ఈ వేకువ కూడా 4 రకాల పనులక్కడ జరిగాయి:

- చిందరవందరగా పడి ఉండి,  లాగుతుంటే చిక్కుపడిన కొమ్మల్ని నరకడమూ,

- ఆ దగ్గరి వారెవరికైనా ఉపయోగపడేలా పెద్ద కొమ్మల్ని సైజులుగా మార్చి గుట్టలుగా పేర్చడమూ,

- సగం ఎండిన ఇతర తుక్కునూ, పిచ్చి మొక్కల్నీ షెడ్లర్ లో పొడి కావించడమూ,

- చివరగా ఆ 100 గజాల బాటను ఊడ్చి, బాగుచేయడమూ!

               కార్యకర్తలు వేలాది రోజులుగా చేసే ఈ పనుల పరమార్థం ఇప్పటికీ గ్రహించక అశ్రద్ధచేసే వారికొక నమస్కారం! తమ తమ నివాస ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు ఏ గ్రామస్తులు కలిసి వచ్చినా స్వాగతం!

               చందమామ విభాగ భవన సముదాయం వెనుక జరిగిన నేటి తుది సభలో దుర్గాప్రసాద్ ఉపాధ్యాయుని నినాదాలూ,

               జ్ఞాపక శక్తి విషయంలో తన మీద తానే జోకు వేసుకొన్న DRK గారు చెప్పిన సరదా సంగతీ,

               రేపటి వేకువ NTR పాఠశాల అప్రధాన ప్రవేశం వద్ద కలుసుకొందామనే నిర్ణయమూ.....

               వదలి పోక తప్పదులే!

ఇదే రూపు కాకున్నా ఇంచుమించు ఈ తరహా

స్వచ్చ సుందరోద్యమాలు అన్ని పల్లె టూళ్ళలోను

మొదలు కాకతప్పవులే –  ఈ దుర్భర కాలుష్యం

ఎంత కాలముండునులే - వదలి పోక తప్పదులే!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  10.04.2026