పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
3800* వ నాటి శ్రమదాన సంక్షిప్త వార్తలు!
శనివారం - ఏప్రియల్ 11 వ తేది - వేకువ 4.20-6.13 నడుమ జరిగిన ఆ విశిష్ట శ్రమదానం వరుసగా 3 వ రోజు కూడ పాగోలు రహదారికే సమర్పితం. తొలుత 16 గురూ, ఆపైన మరో 17 గురూ తమ శక్తి వంచన లేకుండ - అది తమ పంచాయతి కాకున్నా తమ సామాజిక కర్తవ్యాలు నెరవేర్చారు!
నాదేముంది - ఇంచుమించు పనిదినాల్లో 99% హాజరై, వంగి పెద్ద పనులు చేయకున్నా, తోచినవేవో చేస్తూ - ఎవరెంతగా ఏ పనిలో మునిగి, శ్రమలో ఆనందిస్తున్నారో చూస్తూ - కార్యకర్తల పని నైపుణ్యాలకు ఆశ్చర్యపడుతూ - కొందరు పేల్చే సందర్భోచిత ఛలోక్తులు వింటూ – ఇన్ని వేల దినాలుగా 4 లక్షలకు పైగా పని గంటల శ్రమదానం ఎలా సాధ్యపడుతున్నదని అలోచిస్తూ ఉంటాను!
చీకటి వేళ డ్రైన్లలో దిగి, నెర్రెలు కొట్టిన మాగాణి చేలో తిరుగుతూనూ – చెట్లెక్కి వాటిని సుందరీకరిస్తూనూ - దుమ్ము చెలరేగి ముఖాలకీ, ముక్కులకీ, కళ్ళకీ తగుల్తున్నా ఊడ్పు ఆపకుండానూ - కత్తులతో గడ్డి చెక్కుతూనూ - దంతెలతో రకరకాల చెత్తను లాగి ప్రోగులు పెడుతూనూ - భరత్, కోడూరి, అంబటి, రిసెప్షన్ లక్ష్మీ సెల్వం వంటి వాళ్లు నిలువుగా చెమటలకు తడుస్తూనూ - పైగా ఇలాంటి పనుల్తో ఏ కొంచెమో సామాజిక ఋణం తీరుస్తున్నామని ఆనందిస్తూనూ జరిపే శ్రమదానం కదా కష్టతరమైనదీ, అసలైనది!
చివరి 20 నిముషాల్లో :
- సగం మంది కార్యకర్తలెందుకంత చురుకుగా మారతారో,
- అంజయ్య గారు రానందున చెత్త బండెక్కి సర్దే బాధ్యత కోట పద్మగారికెందుకో,
- ముగింపు వేళ దగ్గర పడుతున్నదని కస్తూరి శ్రీను డిప్ప వదిలేసి, పెద్ద పెద్ద పనలు పట్టి మోస్తున్న ఉద్దేశ్యమేమిటో,
- కొందరు నర్సమ్మలు కొమ్మల్ని చరచరా పొలంలోకి ఈడ్చి గుట్టలు పేరుస్తున్న హుషారేమిటో.... ఆలోచించాను! ప్రజల ఆహ్లాదం కోసం చేసే పనుల్లో అలసట ఉండదనీ గ్రహించాను!
పొలంలో జరిగిన సభలో :
- సూర్యవర్ధన్ తరపున నల్లూరి శివకుమారి 10000/- DRK గారికి ఇవ్వడమూ,
- 32 మంది ఈ పూట చేసిన కష్టం పూర్వాపరాలను డి.అర్.కె డాక్టర్ గారు సమీక్షించి, సమూహంగా పనిచేస్తే, ప్రకృతికి దగ్గరగా జీవిస్తుంటే - కలిసి బ్రతికితే దొరికే సంతృప్తీ, తద్ద్వారా ఆరోగ్యమూ వివరించడమూ,
- రేపటి వేకువ కూడ పాగోలు బాట వద్దే కలవాలనుకోవడమూ........ వగైరా!
ఇపుడైన గ్రహించరే!
వందల మందిని హీరో వాయించే స్తున్నప్పటి -
హీరోయిన్ మెలి తిరుగుచు హొయలు పోవుచున్నప్పటి-
హంగు స్వచ్చ కార్యకర్త శ్రమలో కనిపించదే!
ఏది భ్రమో, కనికట్టో ఇప్పటికీ తెలియదే!
ఏది మహోత్కృష్టమో ఇపుడైనా గ్రహించరే!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
11.04.2026