3804* వ రోజు .............           15-Apr-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

బుధవారం(15.4.26) నాటి 3804* వ శ్రమ కూడ ....!!

               వరుసగా 7 వ రోజు కూడ మళ్లీ పాగోలు దారికే సమర్పితం. ఆ కష్టం పాతిక వేల గ్రామ ప్రజల నుండి పాతిక మందికే పరిమితం. ఐతే – పని జరుగుతున్న అపార్ట్మెంట్ల ప్రాంతపు MEO  శ్రీ పరిసే వెంకటేశ్వరరావు గారొక్కరైనా కష్టంలో పాలు పంచుకోవడం ఒక ఊరట!

               రాష్ట్ర, రాష్ట్రేతర ఎన్నెన్ని గ్రామస్తులలో సామాజిక శ్రమదానాన్ని ప్రేరేపించిన పన్నెండేళ్ల సుదీర్ఘ  ఉద్యమం స్థానికుల్లో కొద్ది మందినే ప్రభావితం చేసిందంటే - అది ఆ ఉద్యమ లోపమా - లేక గ్రామస్తుల అవగాహనా లోపమా? ఈ 7 రోజుల - సుమారు 300 పని గంటల స్ఫూర్తి ఇంత మాత్రమేనా?

               చందమామ గృహ విభాగ ప్రవేశద్వారం మొదలు తూర్పుగా 100 గజాల వీధి ఈ వారం రోజుల్లో ఎన్ని మార్పులు చెందినదో - ప్రధానంగా దక్షిణపు డ్రైను ఎంత శుభ్రపడిందో - బాట కిరువైపులా చెట్లు సైతం మరింత అందంగా కనిపిస్తున్నవో – ½ కిలోమీటరు దారి ఎందులకు కళంకరహితంగా తయారైందో పడమటి వీధి, పాగోలు తదితర ప్రజానీకం ఆలోచించాలి!

               “ఆహా! ఇందరు పెద్దలూ, అందులో నడుంనొప్పి సమస్యల వాళ్ళూ మన వీధిని భలే అందంగా మార్చారే!” అని మెచ్చడం కాదు – పని ప్రదేశపు వ్యక్తులు తాము కూడ ఆ ప్రయత్నంలో కలిసి రావాలి! సానుభూతి కాదు – కావలసింది సహకారం!

               నేటి కార్యకర్తల కృషికి సాక్ష్యం అదుగో నిండిపోయిన వ్యర్ధాల ట్రాక్టరు! అపార్ట్మెంట్లవారో, ఇతర గృహస్తులో వాడేసిన డైపర్లతో సహా!

               పని ముగిసి, 6.25 వేళ కాఫీలు ముగిసి, శుభ్రపడిన వీధిభాగాన్ని సంతృప్తిగా చూసుకొని, మెకానిక్ భరత్ పలికిన నినాదాలకు బదులు పలికి,

               రేపటి వేకువ కూడ ఈ అపార్ట్మెంట్ల వద్దే కలవాలని నిర్ణయించుకొని, బుధవారం నాటి శ్రమ ముగిసింది!

               బూడిదలో పన్నీరని

“చల్లపల్లి శ్రమదానం చట్టు మీద వర్షమనీ

బూడిదలో పన్నీరని, అడవిలోన వెన్నెలనీ”

తలపోయకు డెన్నడైన – కలదొక కాలం ముందున

గ్రామస్తులు గుంపులుగా కదలి వచ్చి బాధ్యతగా

శ్రమదానములో పాల్గొను సన్నివేశమతిశయముగ!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  15.04.2026