పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
ఇదిగో – 3805* వ విడత వీధి పారిశుద్ధ్య ప్రయత్నం!
ఇది గురువారం - ఏప్రియల్ ద్వితీయ పక్షపు తొలినాటి కష్టమన్నమాట! ఈ పూట కూడ తమ విలువైన సమయాన్నీ, శ్రమనూ రహదారి బాగుకు త్యజించినది పాతిక మందే! సదరు సమయం సైతం 4.20 - 6.05 నడిమిదే! ఇక - ఈ 35 పనిగంటల కష్టాన్ని దక్కించుకొన్నది వరుసగా 8 వ రోజు కూడ చందమామ అపార్ట్మెంట్ల ప్రాంతమే!
నిన్న మిగిలిపోయిన అపార్ట్మెంట్ల ఉత్తరపు డ్రైన్ లోని 10 గజాల చిట్టడవి నిర్మూలనకు 7 గురు కత్తులతో - దంతెలతో ప్రయత్నిస్తుండగా జరిగిన చిరు ప్రమాదమూ, తమాషా ఒకటున్నది:
పాటల శ్రీనూ, మల్లంపాటి ప్రేమానందమూ, లుంగీధారి వేంకటేశ్వరరావూ, మహాలక్ష్మీ చేస్తున్న పని మధ్య ఒక కొమ్మను నరికినప్పుడు తేనెటీగలు చేసిన దాడీ, ఇద్దరికి తేనెటీగల కాట్లూ ప్రమాదమైతే –
దూరంగా ఉన్న నా చొక్కాలోకి 2 ఈగలు దూరితే - దులుపుకొనే ప్రయత్నంలో నా కళ్లజోడూ, పెన్నూ వగైరాలు రోడ్డు మీద పడిపోతే - మట్టా మహాలక్ష్మికి వచ్చిన నవ్వు ‘కన్నాశుల్కం’ సినిమాలో సావిత్రి ‘లొట్టి పిట్టల’ నవ్వును గుర్తుతెచ్చింది!
కార్యకర్తలు పాతిక మందే గాని - జరిగిన వీధి పరిశ్రమ తక్కువేమీ కాదు! బండెడు తుక్కును షెడ్దర్ నలగకొట్టింది.
- తేనెటీగల చోటు 2 గజాలను వదలి వేయగా మిగిలిన డ్రైను శుభ్రపడింది,
- అపార్ట్మెంట్ల వెనుక వీధి సైతం పాక్షికంగా బాగుపడింది,
- ఆ నివాసాలకు చెందిన MEO గారూ, పూర్ణచంద్రరావు మాస్టారూ కార్యకర్తలతోబాటు చెమటలు క్రక్కారు,
6.20 కి తూము వెంకటేశ్వరరావు గారి నినాదాలతో మొదలైన సభ
1) అమెరికా మత్తు వైద్యుడు మేకా శేషగిరిరావు గారి మనకోసం మనం ట్రస్టుకు 2 లక్షల విరాళంతో బాటు మన సామాజిక బాధ్యతల పట్ల సంతోషమూ, ఆ దంపతుల జన్మప్రాంతం పట్ల ఎనలేని మమకారమూ ప్రతిబింబించే అందరూ చదువదగిన ఉత్తరమూ,
2) ఈ నడకుదురు రోడ్డులో ఈ మధ్యాహ్నం (11:30) గుత్తికొండ కోటేశ్వరరావు గారి సంస్కరణ కార్యక్రమమూ,
3) రేపు సైతం NTR స్కూల్ గేటు దాటినా తర్వాత ప్రాంతమే మన కర్మభూమి అనే నిర్ణయాలతో ముగిసింది.
అదొక కఠిన వాస్తవం
చల్లపల్లి శ్రమోద్యమం సాటిలేని దను విషయం
ఔననినా- కాదనినా అదొక కఠిన వాస్తవం
స్వచ్చ కార్యకర్తల కృషి సరిక్రొత్తది అధ్యాయం
అంతేగాదు –దేశానికి అదే నేటి సందేశం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
16.04.2026