3812* వ రోజు....           23-Apr-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

15* వ నాడు - పాగోలు రహదారిలో ఏమి జరిగింది @ 3812*

               ఈ గురువారం (23-4-26) ఒక స్వచ్చ- హరిత సుందర గ్రామ రహదారిలో ఏం జరగాలో అదే జరిగింది! సమాజం ఎడల కాస్తంత కర్తవ్యం గుర్తొచ్చిన 30 మంది కార్యకర్తలు పన్నెండేళ్ళుగా ఎలా మొండిగా ప్రయత్నిస్తున్నారో అలానే ఈ పూట కూడ దారి పరిశుభ్రత కోసం  వెంపర్లాడారు!

               కాకపొతే స్వచ్చ కార్యకర్తల్ని  వాళ్ల ఖర్మానికి వాళ్ళను వదిలేయక - చందమామ నుండి ఇద్దరూ, పాగోలు నుండి 2 కళాశాలల డైరెక్టరూ,86 ఏళ్లు నిండిన వృద్ధాతి వృద్ధ వైద్యుడూ, నడుం బాధ ఇతరులకు తెలియకుండా చీపురు కర్రనే ఊతగా తెలివిగా మరో వైద్యుడూ, అమెరికా ప్రవాసి నాదెళ్ళ పరుగు వీరుడూ, కాలు బెణికి ఇబ్బంది పడుతున్న ఒక రిటైర్డ్ ప్రిన్సిపాలుడూ పాల్గొన్నారు! ఇంకా పాల్గొనవలసిన కొందరు స్థానిక ప్రజలూ, NTR విద్యా సంస్థల వారూ  రానే లేదు!

               మొదటి 10 మందైతే 4.19 కే NTR పాఠశాల తొలి ద్వారం వద్ద క్రమ శిక్షణతో నిలబడ్డారు. నేనక్కడికి వెళ్లేప్పటికే - 28 మంది చకచకా పనులు చేసుకుపోతున్నారు. పనికి ఆహార పథకం వాళ్లు పెళ్ళగించిన  మట్టిపెళ్లలను ఐదారు చెట్లకు పాదులుగా అమర్చడం చూశాను.

               వీధిని మరొక మారు ఊడుస్తున్న చీపురు వాలంటీర్లనూ, కొమ్మల్ని ఈడ్చుకొని, పొలంలో గర్జిస్తున్న షెడ్దర్ వద్దకు పోతున్న మహిళల్ని గమనించాను. డ్రైనును ప్లాస్టిక్ రహితం చేస్తున్న ఇద్దర్ని మనసులోనే అభినందించాను. ఠంచనుగా 5.40 నుండి తుక్కును ట్రాక్టర్లోకి ఎక్కిస్తున్న చెత్త పనీ, సదరు చెత్త బండిని తోలుతున్న DRK వైద్యుడినీ చూశాను!

               రాజుల- రాణుల ప్రేమ చరిత్రలూ, పౌరాణిక చారిత్రక యుద్ధ క్రీడలూ సినిమాల్లో హీరో ఫైట్లూ ఇవాళ నేను చూసిన సామాజిక బాధ్యతల ముందు అంత గొప్పవి కావని నాకనిపించింది!

ఈనాటి తుది సభను నినాదాలతో నేనే ప్రారంభించవలసి వచ్చింది. ఎప్పట్లాగే “స్వార్థాన్ని ఎలా వదిలించుకోవాలో, సాటి వారి కోసం చేసే చిన్న పనులైనా ఎలా సంతృప్తినిస్తాయో” DRK గారు ఈ పూట కూడ వివరించారు.

               రేపటి రహదారి సేవలు కూడ చందమామ అపార్ట్మెంట్స్ వద్ద ప్రారంభించాలని నిర్ణయించారు.

               ఆదర్శమనీ ప్రకటిస్తాం!

ఏ దశ దిన కఠిన శ్రమతొ – ఏ బాటకు కళ వచ్చెనొ –

నాల్గొందల గంటల శ్రమ నర్పించిన దాతలెవరొ –

ఆ పాగోల్ రహదారికి – ఆ శ్రమ సౌందర్యానికి

అభినందనలర్పిస్తాం - ఆదర్శమనీ ప్రకటిస్తాం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   23.04.2026