3813* వ రోజు....           24-Apr-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

3813* వ మారు సామాజిక బాధ్యతలు కూడ పొగోలు రోడ్డుకే!

               పని దినం సంఖ్య శుక్రవారం(24-4-26) నాటిది! పనులకు దిగిన కర్తవ్య దీక్షితుల సంఖ్య 34! పనుల కేంద్రం పాగోలు గ్రామ పరిధిలోని చందమామ అపార్ట్మెంట్ల ప్రాంతం! రహదారి పారిశుద్ధ్య ప్రయత్న వేళ 4.23 – 6.10 AM.

               మరి ఇంతకీ ఆ పనులేమైనా సుకుమారమైనవా – మర్యాదకరమైనవా - అంటే, అదీ చెప్పలేము! పన్నెండేళ్ల క్రితం మాత్రం చాల మంది హేళనకు గురైనవి! ఇప్పుడిప్పుడే కాస్తంత ఆదరానికి నోచుకుంటున్నా - పెద్దగా క్రొత్త కార్యకర్తలు లభించని పనులే! ఊరిలో ఇంకా ఇప్పటికీ ఈ చెత్త - మురికి - చెమట - దుమ్ము పనులకు కొన్ని ప్రాంతాల వారు బాగా స్పందించి, పాల్గొనడం లేదు గదా!

               సామాజిక - వైయక్తిక రుగ్మతలకూ, ప్రజారోగ్య లోపాలకూ ఈ మహత్తర సామూహిక శ్రమదానం ఒక విరుగుడుగా గ్రామస్తులంతా ఎప్పుడు భావించి, పాల్గొంటారో - అపుడే ఈ స్వచ్ఛ కార్యకర్తల సుదీర్ఘ కాయకష్టం ఫలించినట్లు భావించాలి! ఇంకెంత కాలం చల్లపల్లి, పరిసర ప్రజలు ఈ సామాజిక ప్రయోగానికి దూరంగా ఉంటారో పరీక్షించాలి!

               ఎంత ఓర్పులే కపోతే - 1 కిలోమీటరుకు తక్కువగా ఉన్న ఈ పాగోలు బాటలో 16 రోజుల పాటు - రోజూ పాతిక – 30 - నలభై మంది కార్యకర్తలు పనికి దిగుతారు? ముళ్ల చెట్ల, పిచ్చి మొక్కల, ఖాళీ మద్యం బాటిళ్ళ, ఎంగిలాకుల, రోడ్ల గుంటల బాధ్యతల్ని ఆనందంగా స్వీకరిస్తారు?

               అన్ని రోజుల్లాగే నేటి 30+ కార్యకర్తలు పైన పేర్కొన్న పనులన్నిటినీ సావధానంగా నెరవేర్చారు. చీకట్లోనే కస్తూరి విజయ, లక్ష్మణాదులు గోడలెక్కి మరీ రహదారి సుందరీకరణలు ముగించారు. చివరకు పైడిపాముల రాజేంద్ర ప్రసాదు గారు పిలుపిచ్చిన నినాదాలకు బదులిచ్చారు.

               రేపటి శ్రమదాన స్థలం నాగాయలంక రోడ్డులోని స్వచ్ఛ సుందర టాయిలెట్ల వద్ద అని నిశ్చయించారు !

               శతాబ్దానికొక్కమారు

గాంధీ వంటి మహాత్ములో, గత కాలపు మహర్షులో

శతాబ్దానికొక్కమారు సాగించే ఉద్యమమిది

చల్లపల్లి కార్యకర్తలవలీలగ – నడిపిస్తే

ఆనందం - ఆశ్చర్యం అలముకొనక తప్పదు గద!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   24.04.2026