3814* వ రోజు....           25-Apr-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

శ్రమదానంలో (25-4-26) శనివారం ప్రత్యేకత! – 3814*

               అంటే-శని ఆదివారాలు తప్ప మిగిలిన 5 రోజులూ అది చప్పగా జరుగుతుందని కాదు, ఆ రెండు రోజుల కార్యకర్తల సంఖ్సగాని, క్రొత్త కార్యకర్తల ప్రవేశం గాని, సామూహిక శ్రమోత్సవం గాని వేఱుగా ఉంటాయి.

               ఈ వేకువ సమయాన నాగాయలంక రోడ్డులోని పబ్లిక్ టాయిలెట్ల – బండ్రేవు కోడు కాల్వ వంతెనల దగ్గర 4.17-6.10 నడిమి కాలపు సందడినే చూడండి-కార్యకర్తల సంఖ్య పంచ పదులు దాటి పోయింది!  అది కొన్ని సందర్భాలలో 100 ను కూడ దాటేస్తుంటుంది!

               6.25 కు రహదారి తూర్పున మిల్లు ఆవరణలో జరిగిన తుది సమావేశాన్నే గమనించండి- అర్థవలయంగా నిలబడి, కొందరు కూర్చొనీ నాయుడు మోహనరావు గారు

               “సమాజం పట్ల ప్రేమమూర్తులైన కార్యకర్తలను” రేపటి తమ గృహ ప్రవేశ, సత్యనారాయణ వ్రతాలకు ఆహ్వానించి, శ్రమదాన ప్రతిజ్ఞలు చేస్తున్న దృశాన్నీ,

               Dr. పద్మావతిగారు అంత్యప్రాసానుగుణంగా

               “ఈ పూట 50 మందిమి రహదారి స్వీపింగ్,

               చాలమంది గ్రామస్తులేమో ఈ టైం లో స్లీపింగ్...” అంటూ ఉత్సాహపరచడాన్నీ వీక్షించండి! (ఇంకా నయం-పాటల శ్రీను గొంతు విప్పలేదు!)

               “అసలెందుకిందరు వేకువ వేళనే ఇలా మురికి-రొచ్చు-చెమట పనులకు దిగుతారనేది పెద్ద రహస్యమేమీ కాదు, గత పుష్కరకాలపు స్వచ్ఛ కార్యకర్తల నిరంతర ప్రయత్నంతో ఊళ్లో వ్యాపిస్తున్న శ్రమదాన సంస్కృతి, గ్రామ సామాజిక స్పృహా అందుకు కారణాలు కావచ్చు!

               ఇటు పాగోలు రోడ్డు మొదలు 150 గజాల నాగాయలంక రోడ్డు ఇందరి శ్రమతో అందంగా మారకుంటుందా? అడపా వెంకట్రామయ్య గారి వీధి ఉద్యానమూ, మూతబడిన పెద్ద వడ్లమర ప్రాంతమూ కళకళలాడకుంటుందా?

               రేపటి శ్రమదానం కోసం పాగోలు పరిధిలోని “చందమామ” అపార్ట్మెంట్ల వద్ద కలవాలనేది నేటి నిర్ణయం!

               చాటింపులు వేయాలా?

శ్రమదానపు ప్రాశస్త్వము చాటింపులు వేయాలా?

వేదికపై మైకు ముందు వీనులదర అరవాలా?

శ్రమదాతల తృప్తి గాంచి, గ్రామములో మార్పులెంచి

ఇదొక అపూర్వ ఉద్యమమని ఎవ్వరైన గ్రహించలేర?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   25.04.2026