3819* వ రోజు....           30-Apr-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

ఇది గ్రామ సామూహిక శ్రమదానంలో 3819* వ రోజు!

               4:15 కే - ఈ ఏప్రిల్ మాసాంతాన శ్రమ త్యాగ సంసిద్ధులు 11 మందీ, క్రమక్రమక్రమంగా మరో 24 మందీ-

               6:10 దాక యధాశక్తిగా పాటుబడ్డారు. వాళ్ళ శారీరక కష్టానికి స్థలం సాగర్ టాకీసు బైపాస్ వీధిలోని పాలకేంద్రం ప్రక్కనేగల 5 ఎకరాల ఖాళీ పొలం!

               అందలి చిట్టడవుల్నీ, ఎగుడు దిగుళ్ళనీ, రాళ్ళూ-రప్పల్నీ JCB లతో తొలగించి, సరిజేసి, ప్రోగులు  పెట్టించినది చల్లపల్లి ప్రేమికుడు సజ్జా చలపతిరావే! క్రికెట్ గ్రౌండ్ తయారీలో స్వచ్ఛ కార్యకర్తల ఈ 3 నాళ్ల పాత్రేమంటే-అందలి పుల్లా పుడకలూ, ప్రభుత్వ కార్యాలయాల వెనుక రకరకాల చెత్తలూ, అక్కడక్కడా పేడలూ, మిగిలిపోయిన గడ్డి ఏరి, డిప్పలకెత్తి, రోజుకొక ట్రాక్టర్ చొప్పున డంపింగ్ యార్డ్ కు తరలించడమే!

               ఇక అగౌరవప్రదంగా చాలమంది భావించే ఈ పనులు చేసేదెవరయ్యా అంటే-

               నడుము సరిగ్గా లేని ఒక డాక్టరూ, శ్వాసలో ఇబ్బంది పడే ఒక హిందీ పంతులూ, సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులూ, సర్పంచి దంపతులూ, అమెరికా నుండి వచ్చి, మట్టి పనికి పూనుకొనే సురేష్ నాదెళ్లా, కుడికాళ్లు గాయాలైన ఆనందరావూ, ఈ రామారావు వగైరాలు!

               “అమ్మో! ఐదెకరాల పొలం బాగుచేయడమా!” అని భయపడని మనుషులు! 28 వేల గ్రామ జనాభాలో ½ శాతం మంది గ్రామ ప్రయోజనార్థం అప్పుడప్పుడైనా వచ్చి సహకరించరా” అని ఎదురుచూపులు!

               ఇంతగా బాగుపడిన శ్మశానాలూ, గ్రామ ఉమ్మడి ప్రదేశాలూ, వీధులూ, చుట్టూ రహదారులూ, అందమైన పబ్లిక్ టాయిలెట్ సౌకర్యాలూ, పాచ్ వర్కులు జరిగిన-జరుగుతున్న రోడ్లూ, 32 వేల చెట్ల నీడలూ చూస్తూ కూడా ఈ ఉమ్మడి శ్రమదానానికిప్పటికీ దూరంగా ఉంటున్న విజ్ఞులూ..... ఇది నేటి స్వచ్ఛ-శుభ్ర-హరిత-సౌందర్య కూడలిలో ఉన్న చల్లపల్లి!

               న్యాయవాది కొడాలి మురళి తడబాటును సర్దుకొని చెప్పిన నినాదాలూ, ఎక్కువగా మాట్లాడని సజ్జా - నాదెళ్లలూ, క్రికెట్ వంటి క్రీడా ప్రాంగణ ఖర్చుల గూర్చిన ఆలోచనలూ,

               స్వచ్ఛ కార్యకర్తల కష్టాన్ని గుర్తించే DRK వైద్యుడూ,

               రేపటి శ్రమదానం కూడ ఇదే బైపాస్ వీధిలోనే అనే నిర్ణయమూ ఈ గురువారం గంటన్నర శ్రమదాన విశేషాలు!

               నిమ్మగడ్డ వాస్తవ్యులు మాలెంపాటి చక్రధర చౌదరి- జ్యోతి గార్ల కుమార్తె ‘కీర్తి సాయి’ (USA) స్వచ్ఛోద్యమ ఖర్చుల నిమిత్తం 5 వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. గతంలో కూడా వీరు 5 వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

               అర్థము లేని వ్యసనమ!

ఊరి చెత్తలు తుడిచి పెట్టుట కుద్యమించుట వెర్రితనమా?

ప్రజాహ్లాదము కొరకు మొక్కలు ప్రతిష్టించుట కుర్ర చేష్టా!

సింగిల్ యూజ్ ప్లాస్టిక్కులెన్నో ఏరివేయుట వెకిలిచర్యా!

దేశమంతా మెచ్చు ఈ శ్రమదాన మర్ధము లేని వ్యసనమ?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   30.04.2026