పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
శనివారం వేకువ కార్యకర్తల సంఖ్య 44!- @3821*
వారిలో కొందరి పని 4.30 కు 10 నిముషాల ముందే ప్రారంభం! పనుల ముగింపు వేళ
6.10. అంటే 110 నిముషాల శ్రమదానమన్నమాట. 5.30 సమయాన సజ్జా చలపతి రావు మరో ఇద్దరి మాటల సారాంశం ఇది-
“ఏదో ఒక పావుగంటో – అరగంటో ఒకసారి ఉచితంగా నన్నాచేస్తాం గాని, ఎంత కూలి ఇచ్చినా ఇలాంటి చెత్త- బురద పనులు మేం చేయం” అని కూలి పనుల వాళ్ళు అంటున్నారని!
మరి ఇన్ని వేల రోజులుగా – 4 ½ లక్షల పని గంటల బురద-దుమ్ము, మురికిపనులు స్వచ్చ కార్యకర్తలు ఎందుకు ఉచితంగా చేస్తున్నట్లు?
“రాబోయే ఎన్నికల్లో గెలిచి, పదవుల కోసమా? ప్రాపకం కోసమా? రోజూ బట్టలు చెమటలతో తడిసి, ముఖాలకు దుమ్ము కొట్టుకుని, ఇంటికి వెళ్లేది ఎందుకు”? అని ఆరాతీస్తే-
కార్యకర్తలకదొక ఆత్మ సంతృప్తట! ‘ మన ఊరి పనులు మన కోసం మనం చేసుకోలేమా అనే పంతమట! ఏదో ఒక వీధిని శుభ్ర పరిస్తే, మొక్కలు పెంచితే- అవి గ్రామస్తులకు ఆహ్లాదం కలిగిస్తే – అదే వాళ్లకు సంతోషమట!
కబుర్లతో సరి పెట్టక – అనుకొన్న మంచిని ఆచరిస్తే కలిగే ఆనందమే వేరట!
ఇలాంటి సంకల్పమే బైపాస్ వీధిలోని క్రొత్తగా తయారౌతున్న క్రీడా ప్రాంగణంలో 5 వ రోజు కూడా వారిని పొలంలో దించింది.
ఎంత కూలి ఇస్తామన్నా కొందరు వంగని
1.చిత్తు కాగితాలు ఏరుట,
2. నేలలోని ప్రాత బట్టల్ని లాగుట,
3. త్రాగి పారేసిన సీసాలను ప్రోగు చేయుట,
4. గడ్డినీ, చెత్తనూ, పిచ్చి మొక్కల్నీ తొలగించుట,
5. ఈ వ్యర్థాలన్నిటినీ ట్రాక్టర్ లోకి ఎత్తుట వంటి పనులను చేయించింది.
నేనీ ఉదయాన కార్యకర్తలు కార్చిన చెమటల్ని చూశాను, 3 నిముషాల పాటు నేల నుండి బట్టల్ని బలంగా పెకలిస్తున్న ఒక వృద్ధ కార్యకర్తను గమనించాను, డబ్బూ- కీర్తి - పదవుల ప్రలోభాలుంటే ఇలాంటి పనులు చేయలేరనీ తెలుసుకున్నాను.
6.20 కి కాఫీలు త్రాగి, ఇంకా ఏం చేస్తే ఊరికి మంచి జరుగుతుందో చర్చించి, 44 మంది ఒక చోట చేరి, విశ్రాంత, భౌతిక శాస్త్రోపన్యాసకుడు సూర్యదేవర నాగేశ్వరరావు చేసిన నినాదాలు విన్నాను.
గ్రామ ప్రముఖ వ్యాపారీ, వయోధికుడూ సాయి గారు చెత్త డిప్పలు మోయడమేమిటా అని ఆలోచించాను.
నెల మారినప్పుడల్లా 5 వేల విరాళాన్ని శంకర శాస్త్రి గారు “మనకోసం మనం” ట్రస్టుకు అందించడమూ చూశాము.
రేపటి వేకువ ఇక్కడ-క్రీడాంగణంలో పని ముగించాలని నిర్ణయించడం కూడ విన్నాను!
పురాణాలను చదివితిమి గద!
పురాణాలను చదివితిమి గద! పూర్వచరితలు గ్రహించాం గద!
త్యాగమే అతిదొడ్డ గుణమని, స్వచ్ఛ శుభ్రతె దైవ ప్రియమని
తెలిసి కూడా సొంత ఊరికి త్యజించమ ఒక గంట సమయం?
కలిసి నడువమ? స్వచ్ఛ సుందర కార్యకర్తల కండదండగ!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
02.05.2026