పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
3 రోజుల శరీర శ్రమతో అందంగా మారుతున్న NTR పార్కు - @3825*
శ్రమ 48 మందిది, అది గురువారం (6.5.26) వేకువ 4.20-6.10 నడిమిది, కార్యకర్తలూ+నడకమిత్రులూ చెట్టాపటాలు వేసుకుని 28 వేల చల్లపల్లికీ + పరిసర ప్రాంతానికీ ఆహ్లాద + ఆరోగ్యప్రదమైన 60 కి పైగా పనిగంటల శ్రమ ప్రస్థానమది!
పూర్వకాలంలో అనేవారు – ‘అన్నదానం, విద్యాదానం’ చాల గొప్పవని! కాని నాకనిపిస్తున్నది – “ఇంత అర్థవంతమైన సామాజిక – సామూహిక శ్రమదానం ఈ కాలంలో ప్రతి గ్రామానికీ అత్యవసరమని!
ఈవిషయం గత 12 ఏళ్లుగా రాష్ట్ర - రాష్ట్రేతర విజ్ఞులూ, ఎక్కువ మంది చల్లపల్లి ప్రజలూ అంగీకరిస్తూనే ఉన్నారు! స్వచ్ఛ కార్యకర్తలు మాత్రమే దాన్ని ఎండనక - వాననక ఆచరిస్తుంటారు!
ఆదర్శాన్ని కాదు - దాని ఆచరణ ఎలా ఉంటుందో చూడాలంటే - చల్లపల్లిలోని వేకువ శ్రమ వేడుకను చూసి తీరాల్సిందే! ఈ 3825* వ నాటి NTR పార్కులోని శ్రమ సందడినే చూస్తే:
* చెట్లను సుందరీకరించారు, పాదులు తీర్చిదిద్దారు సరే - కాస్త ఒరిగి పెరుగుతున్న కొబ్బరి చెట్టును ఐదారుగురు బలంగా లాగి నిలబెట్టి స్తంభానికి బిగించాలా అనిపించింది.
* గత 3 రోజుల కష్టం తరువాత పార్కు లోపల చుట్టూ - ముఖ్యంగా ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రహరీల లోపల ఎంత అందంగా, శుభ్రంగా కనిపిస్తున్నదో చూడండి!
* ఒక వంక రకరకాల చెట్లు, రోడ్డు వైపున స్వచ్ఛ సుందర పబ్లిక్ టాయిలెట్లు, షటిల్ కోర్టు, పిల్లలకు క్రీడా సౌకర్యాలు, బోలెం వారి ప్రదర్శనశాల, పిల్లలకూ, పెద్దలకూ ఓపెన్ జిమ్ లు..... వీటి నడుమ 4 డజన్ల మంది సముచిత శ్రమదానం - ఇదంతా ఒక్క చల్లపల్లికి మాత్రమే సాధ్యం!
* చూస్తుండగానే పుష్కరకాలపు శ్రమదానం కర్పూర కళికలా కరిగిపోయింది.
* ముందుముందు చల్లపల్లిలోని ఇతర ప్రదేశాల వలెనే ఈ సుందరమైన పార్కు కూడ పర్యాటక స్థలం కానున్నది!
నేటి శ్రమానంతర సమావేశం పావులూరి శేషయ్య గారి నినాదాలతో ప్రారంభమై, DRK గారి అభినందలతోనూ,
1. 8 వ తేదీ తమ ‘బృందావన్ హోమ్స్ బ్లాక్ – బి’ కు శంఖుస్థాపన శుభవేళకు ముందస్తుగా నూకల రామ్ కుమార్ గారి 10 వేల వితరణతోనూ,
2. సీనియర్ స్వచ్ఛ కార్యకర్త కోడూరు వారి 520/- ఆర్ధిక సహకారంతోనూ,
రేపటి శ్రమదానం కాసానగరం దగ్గర చెక్ పోస్ట్ వద్ద అనే నిర్ణయంతోనూ ముగిసింది!
చెక్ పెట్టుట ఎంతపని?
ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించితే చాలును
పంచాయతి నిజాయతీగా వ్యవహరించిన చాలును
వ్యాపారులు, ప్రజలందరకవగాహన రావలయును
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లకు చెక్ పెట్టుట ఎంతపని?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
06.05.2026