పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
మళ్లీ కాసానగర్ జంక్షన్ కు మారిన శ్రమదానం! - @3826*
మార్పు మే 7-2026 - గురువారం నాటిది. ఊరికి దూరమైనా సరే - 4.20 కే అక్కడ నిలబడిన కార్యకర్తల ఫొటో చూశారా? అందులో మహిళలే ఎక్కువమంది ఉన్నారని గుర్తించారా? అప్పుడప్పుడైనా ఇలా స్వచ్చోద్యమంలో స్త్రీ శక్తి దే పై చేయి కావడం హర్షించదగిన పరిణామం కాదూ?
అదీ కాక నేటి శ్రమదాతలు మొత్తం 33 మందిలో మూడు క్రొత్తముఖాలున్నవి గమనిస్తిరా? ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులు - డేవిడ్ అనిల్, జాన్ స్టన్ లతో బాటు యువకుడు పేరుబోయిన శాయి.
ఈ జాన్ స్టన్ మాస్టరు గారే నేటి ముగింపు సభను నినాదాలతో ప్రారంభించి, వేసవి శెలవులన్నాళ్లూ శ్రమదానం చేస్తామనీ, టీనేజర్లను కూడ ప్రోత్సహించి, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామనీ, అప్పుడే ఈ శ్రమదానోద్యమం దీర్ఘకాలం కొనసాగగలదనీ ప్రకటించారు!
డి.ఆర్.కే డాక్టరు గారైతే - అందుకు హర్షం ప్రకటించి, కాసానగర్ ప్రక్కన సిమెంటు రోడ్డు అతుకులెందుకు వేయవలసి వచ్చిందో - దాని ఖర్చు రాన్రానూ, ఎలా పెరిగిపోతున్నదో వివరించారు!
“మనకోసం మనం” ట్రస్టూ, కార్యకర్తలు కూడ పట్టిచుకోకుంటే – ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతాయో - బరంతులు వేయకుంటే ఇంత విలువైన రోడ్లెలా అంచులు విరిగిపోతాయో అని ఆవేదన చెందారు!
మరి, కార్యకర్తల కష్టాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? బాటకు పడమర ఎన్ని గలీజులు డిప్పల కెత్తి ట్రాక్టర్ దాక మోశారో, ఎండిన ముళ్ళ కొమ్మల్ని తొలగించారో, ఇద్దరు కార్యకర్తలు 3 డిప్పల సీసాలను ప్రోగేశారో చూస్తూనే ఉన్నాను! రహదారి తూర్పు డ్రైన్ లో 15 మంది సాధించిన సాధించిన స్వచ్ఛ శుభ్రతను గ్రహించాను!
కార్యకర్తల మెలకువకూ, చురుకుకూ, నిన్న ఉదాహరణలు చూశాను –
1) నిన్నటిని నేను గురువారంగా పేర్కొంటే ప్రేమానంద్ తదితరులు కొందరు స్పందించడమూ,
2) పినిశెట్టి నిరంజన్ నన్నాధారంగా చేసి రచయితగా మారడమూ.
రేపటి శ్రమను కూడ కాసానగర్ వద్ద రహదారికే పరిమితం చేయాలని నిర్ణయించారు!
అపుడు గదా
రకరకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను మానేస్తే -
వీధి నిండ ఫ్లెక్సీలను పెట్టడాలు ఆపేస్తే -
బ్యానర్లను గుడ్డతో తయారీనీ ప్రోత్సహిస్తే
అపుడు గదా చల్లపల్లి ఆదర్శం రాష్ట్రానికి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
07.05.2026