పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
కాసానగర్ వద్దనే మరొక (శుక్రవారం -8.5.26) ప్రయత్నం! @3827*
ప్రయత్నం 4:20-6:06 మధ్య జరిగింది గాని – ప్రయత్నీకుల సంఖ్య ఈ పూట బక్క చిక్కింది! బొత్తిగా 29 మందికే పరిమితమయింది? ఆ సంఖ్యయినా - పెదప్రోలు శివారు కాసానగర్ నుండి ఇద్దరు ఉద్యోగులు వచ్చి కలిస్తేనే!
చేయవలసిన చెత్త పనులూ, కలుపు పనులూ, డివైడర్ల పరిశుభ్రతా చర్యలు చాలా ఉండగా ఈ కాస్తమందేనా కార్యకర్తలు? అని నాకనిపించింది గాని సుదీర్ఘకాలంగా రాటు తేలిన కార్యకర్తలకు కాదు!
వాళ్లకు కనిపించేది ఆ రహదారి మీద దుమ్మూ, మార్టిన్ల చెత్త పరకలూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దరిద్రాలూ, ప్రక్కన బరంతులు లేక విరిగిపడేట్లున్న రోడ్డు అంచులూ, ఏరోజుకారోజు శుభ్రపరచిన డ్రైన్ గట్టుమీద మళ్ళీ వచ్చి పడుతున్న గలీజులూ, త్రాగిపడేసిన నీళ్ళ, సారా సీసాలూ! అందుకనే నిముషం వ్యర్ధపరచకుండా ఉన్న రహదారి బాధ్యతల్ని ఎంచుకొని, పంచుకొని –
1) 6 గురు రోడ్డు పడమటి ఖాళీ జాగా నుండి పాతిక డిప్పల వ్యర్థాలు ఏరారు,
2) అందులో రాతి ముక్కలూ, చెక్కముక్కలూ విడగొట్టి, రోడ్డుకు బరంతుగా సర్ది, ప్రయాణికుల భద్రతకు జాగ్రత్త పడ్డారు!
3) నడకదారులకు ఇబ్బంది లేకుండ 10 డిప్పల మట్టితో చదును కూడ చేశారు!
4) తూర్పు ప్రక్క నిన్న శుభ్రపడిన చోట మళ్లీ వ్యర్ధాలు ప్రత్యక్షమైతే ఆ అరేడుగురు కార్యకర్తలు విసుక్కోలేదు - బాధ్యత లేని గ్రామస్తుల్ని కోపపడనూ లేదు!
5) మొన్నటి వర్షానికి రెండు డివైడర్లలో కలుపు బయలు దేరితే 7-8 మంది ముళ్లు తప్పించుకొంటూ ఎంత నేర్పుగా శుభ్రపరిచారో దగ్గరుండి చూశాను!
6) నలుగురు చీపుళ్ల వారు గంటన్నర సమయంలో - మధ్యలో మంచి నీళ్లు త్రాగడానికి తప్ప – విశ్రాంతి కోరలేదు!
7) లోడింగు బ్యాచ్చి కూడ తమ విధిని నిర్వర్తించారు!
A) ఈ ఉదయం రెండవ ప్రక్క సిమెంటు బాట నిర్మాణానికి 8:30 – 12:00 నడుమ వీలైన కార్యకర్తలు కాసానగర్ వద్దకు రావాలనీ...
B) కుదిరితే - కాసానగర్ నుండి మరికొందరు వస్తే - రేపు చెరువు ప్రక్క రోడ్లు గుంటలు పూడ్చాలనీ నిర్ణయించారు.
రేపు వేకువ కూడ హైవే జంక్షన్ చెక్ పోస్టు వద్ద కలవాలనుకొన్నారు! ఈ ఉదయం శ్రమోదానోద్యమ నినాదాలు ప్రకటించినది
చెక్ పెట్టుట అసాధ్యమా?
వీధుల సౌందర్యాలను ఇనుమడింప జేస్తేమి కద
మురుగులు వీధుల కెక్కుట నివారింప జాలితిమే
మల మూత్ర విసర్జనలను తొలగిస్తిమి చాల వరకు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లకు చెక్ పెట్టుట అసాధ్యమా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
08.05.2026