3829* వ రోజు....           10-May-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

అసాధారణమైన శ్రమోద్యమంలో3829*(ఆదివారం - 10.5.2026).

               అది ఎప్పటిలాగే 4.19 కే ప్రారంభమై, కళా వేదిక ఎదుట70 మంది నిలిచి, నలుగురు పిల్లల స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతోనూ, DRK గారి విలక్షణ సమీక్షా వచనాలతోనూ, రేపటి వేకువ కూడ NTR పార్కు నందే పునరంకితం కావాలనే నిర్ణయంతోనూ ముగిసింది.

అదే సమావేశంలో :

- “ఇది నిస్సందేహంగా ప్రపంచంలో మరెక్కడా జరగని సామాజిక ప్రయోగం”.... అని గోళ్ల శ్రీధర్  గారు అభిప్రాయం వెలిబుచ్చగా,

- ఇటీవల మేకా శేషగిరి రావు (USA), మాకినేని దుర్గా ప్రసాద్, మొక్కపాటి పాండురంగారావు, దివంగత ఉపాధ్యాయిని పరుచూరి వసుమతి గార్ల 4 లక్షల 25 వేల విరాళాల్ని పాగోలు, పెదకళ్ళేపల్లి, నాగాయలంక రహదార్ల భద్రతలకు ఎలా ఖర్చు చేసినదీ డాక్టరు గారి వివరణకు చప్పట్లు మ్రోగగా,

- అప్పటికప్పుడు తాత్కాలికంగానైనా సదరు సభికులలో “ గ్రామ సమాజానికి పనికొచ్చే స్వచ్ఛ -సుందరోద్యమంలో ఇక మనం పాల్గొని తీరాలి” అనే ఆవేశం కలుగగా, ఈ ఆదివారం కార్యకర్తల ఆశయం నేరవేరినట్లయింది!

               45 గురు రెగ్యులర్ స్వచ్ఛ కార్యకర్తలూ, సుమారు 20 మంది నడక వ్యాయామకారులూ, ఇంకొందరు జిజ్ఞాసువులూ రెండు గంటలు ఆ పార్కులో ఎలా పాటుబడ్డారో విడివిడిగా వ్రాయలేను గాని –

               నేటి కృషి ప్రధానంగా షటిల్ కోర్టు చుట్టూనూ, మంచి నీటి వడపోత వద్దా, 4 రోజులు వెంకటాపురం కూలీలు పీకి కోసి వదలిన గడ్డిని 2 ట్రక్కుల నిండా డంపింగు కేంద్రానికి తరలిస్తూనూ జరిగిందని చెప్పగలను. (మరిన్ని వివరాలకు తూము వారి వీడియో- ఆడియోలను చూడండి!)

               “వేల దినాలుగా తమ ఊళ్లో ఈ శ్రమ జాతరలేమిటో- ఎక్కడెక్కడి దాతలు మన గ్రామం సుఖ సౌకర్యాల కోసం లక్షల్లక్షలెందుకు దానమిస్తారో – ఇక్కడ పుట్టి పెరిగి బ్రతికే మన కర్తవ్యమేమిటో ...” అనేవి మాత్రం తప్పక ఆలోచించండి!

               ఈ ఉదయం 9 గంటలకు NTR పార్కు తూర్పున క్రీడా ప్రాంగణాల ప్రారంభోత్సవానికి గ్రామస్తులంతా హాజరుకండి!

               రేపటి మన శ్రమదానం NTR పార్కులో అని మరొక మారు గుర్తు చేయడమైనది!

               శాస్త్రీయత పాటిద్దాం!

స్టీలు గ్లాసు, స్టీలు ప్లేటు చేతిలోన గుడ్డ సంచి

చెక్క స్పూను, స్టీలు సీసా... తక్కిన వస్తువులన్నీ

ప్లాస్టిక్ రహితంగానే వాడుకొనుచు బ్రతుకుదాం

ఇప్పుడైన – కొంచమయిన శాస్త్రీయత పాటిద్దాం!

  ఇట్లు విన్నవించువారు -

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   10.05.2026