3830* వ రోజు....           11-May-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

నిన్నా మొన్నటికి దీటుగానే సోమవారపు (11-5-26) శ్రమ!@3830*

               శని - ఆదివారాల శ్రమదానం సంగతి వేరు, మరుసటి వేకువ కూడ చల్లపల్లి గ్రామ సామాజిక బాధ్యులు 44 మంది కలిసిమెలసి 4.20-6.06 నడుమ రకరకాలుగా NTR పార్కు సుందరీకరణకు పూనుకోవడమంటే –

               డాక్టర్ డి.ఆర్.కె. గారు పదే పదే పదే చెపుతున్నట్లు-

               “ఇన్ని రకాల నేపధ్యాల వారు - పొరుగూళ్లు నుండి కూడ వచ్చి, నిస్వార్థంగా గంటో గంటన్నరో సమయ శ్రమదానం చేయడం బహుశా ఈ చల్లపల్లిలో మాత్రమే సాధ్యం!”

               వీరిలో కొందరిది వ్యసనం, కొందరిది సరదా, కొందరిది ప్రారంభం, అందరిదీ సొంతూరి పట్ల నిబద్ధత, అంతిమంగా ఎనలేని ఆనందం!

               ఎండుగడ్డి చెక్కే - ప్రహరీల పక్కన కలుపు, పిచ్చి మొక్కల్ని తొలగించే-వెంకటాపురం పనివారు పీకేసిన గడ్డిని ప్రోగులు చేసి, ట్రాక్టర్ దగ్గరకు మోసే - చెట్ల ఎండు కొమ్మల్ని రంపాలతో ముక్కలుగా కోసే - పలుగూ పారల్తో మట్టి గడ్డల్ని తిరగేసే పనులు చేస్తున్నప్పుడు కార్యకర్తల, నడక మిత్రుల ముఖాల్లో ఎంత సంతోషమో! తాము కూడ గ్రామ ప్రయోజనం కాస్తైనా సాధిస్తున్నామనే సంతృప్తీ గమనించారా? ఆ ఆనందమే ఇప్పుడు మిగిలిన గ్రామస్తుల్లోనూ రావలసింది! అది సాధించాలనే స్వచ్ఛ కార్యకర్తల 12 ఏళ్ల నిర్విరామ ప్రయత్నం!

               పదేళ్ల చిన్నారులూ, 80 ఏళ్ల వృద్ధులూ, మహిళలూ ఇంతగా శ్రమిస్తున్నారంటే - 6.25 కి NTR కళావేదిక వద్ద నిలిచి, మాలెంపాటి అంజయ్య గారి ననుసరించి, “జై జై స్వచ్ఛ సుందర చల్లపల్లి - స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిస్తాం, సాధిస్తాం!” అని నినదించడం వాళ్ళ సంకల్ప చిహ్నం! 3830* రోజుల శ్రమదాన సంఖ్యను ప్రదర్శించే గుడ్డ బ్యానర్ వాళ్ల పట్టుదల కొక గుర్తు!

               రేపటి వేకువ శ్రమదానంతో యీ పార్కు శుభ్ర - సౌందర్యసాధన ముగుస్తుందని కార్యకర్తల అంచనా!

               ప్లాస్టిక్ నాపుటె తేలిక!

శ్మశానాల, బస్ స్టాండులసౌందర్యం సాధించుట

వీధులు, రహదార్ల వెంట వృక్ష సంపదను పెంచుట

హైందవ, ముస్లిం బరియల్గ్రౌండు లనూ సంస్కరించు

పనుల కన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నాపుటె తేలిక!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

 

   11.05.2026