పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
33 మంది కార్యకర్తలూ – 3833* రోజుల శ్రమలూ!
మరియూ 4 ½ లక్షల పని గంటల శ్రమధారావాహిక!
ఆ ఊరు కృష్ణాజిల్లాలోని చారిత్రాత్మక గ్రామం చల్లపల్లి; అందలి 22 వార్డుల్లోని సుమారు 28 వేల మంది ప్రజలకు గాను 200 మంది స్వచ్ఛ కార్యకర్తలు; 13 ఏళ్ళ క్రితం ఆ పల్లె అన్నిటిలాగే బాహ్య విసర్జన, మురుగు కంపు, దుమ్మూ - మురికీ, చాలని పచ్చదనం వంటి అవలక్షణాలన్ని ఉన్నదే!
అప్పట్లో ఊరి నుండి పొరుగు రాష్ట్రాలకో - విదేశాలకో వెళ్లి, చెప్పాపెట్టకుండా ఇటీవల తిరిగి వచ్చిన వాళ్ళు తమ ఊరు ఇదేనా అనేంతగా - 33 వేల పండ్ల - పూల - నీడ చెట్లతో, ప్రధాన వీధులన్నీ శుభ్ర సౌందర్యాలతో, ఏదో తెలియని క్రొత్తదనంతో - ఆహ్లాదకరంగా ఫీలవుతున్నారు! కారణం తెలుసుకొని, ఆ మార్పుకు కారకులను అభినందిస్తున్నారు!
ఈ 2026 – మే - 14 - గురువారపు కార్యకర్తల పట్టుదలనే చూడండి - తమ ఇళ్లకు 3-4 కిలోమీటర్ల దూరాన – కాసానగర్ - చెక్ పోస్టు ప్రాంతాన - 4.20 కే మొదటి బ్యాచ్ స్వచ్ఛ వాలంటీర్లు హాజరు! మరి కొంచెం ఆగి చూస్తే - చిన్నా - పెద్దా కలిసి మొత్తం 33 మంది - నేటి పని దినం సంఖ్య 38 33 కు మ్యాచ్ అయేట్లుగా - ఎవరి పద్ధతిలో వాళ్ళు
1) జంక్షన్ డ్రైన్ ముళ్ల కొమ్మల, ప్లాస్టిక్ తుక్కుల, చెత్తా చెదారాల మీద ప్రతాపం చూపిస్తున్నారు,
2) వాళ్ళ చేతుల్లో కత్తో - దంతో డిప్పో - వాటితో పని చేసుకుపోతున్నారు,
3) ఇక వాళ్ళకు తోడు ప్రక్కనే చెత్త బండి, అందులో 12 ఏళ్ల చిన్నారి,
4) ఇక్కడికి దూరంగా – కప్తాన్ పాలెం దిశగా డివైడర్ లో ఆ మధ్య శుభ్రపరచింది చాలక 14 మంది కార్యకర్తల మొక్కల పాదుల మరమ్మత్తులు!
5) ఈ సామాజిక సేవల్ని పట్టించుకోక - తమ పనుల్లో కాసానగర్ జనులూ, చిన్న గుడి వద్ద కొందరూ, చెక్ పోస్టు ఉద్యోగులూ!
30-40-50 మంది ఇలా పూనకం వచ్చినట్లు NH.216 రహదారి ప్రా౦తాన్ని శుభ్రపరస్తుంటే అది అందంగా మారకేం చేస్తుంది?
ఈరోజు “మనకోసం మనం” ట్రస్టుకు చల్లపల్లి జనవిజ్ఞాన వేదిక శాఖ నుండి మరొక భూరి విరాళం - 1,20,000 చెక్కు రూపంలోఅందినది.
ఈ పూట జాస్తి జ్ఞానప్రసాదు గారి నినాదాలకు ముందు –
శంకర శాస్త్రి గారు పంచిన అందమైన చేరుమాళ్లూ, (నిన్న పల్నాటి అన్నపూర్ణ - అందించిన రాగి – రవ్వ లడ్లూ) తరువాత DRK గారి సమీక్షా వచనాలూ+హిత వచనాలూ,
రేపటి శ్రమ కూడ NH.216 – చెక్ పోస్టు (కాసానగర్) వద్ద అనే ప్రకటనా జరిగిపోయినవి!
నిష్కామ కర్మ ఫలితముగా
తమకు కాక పరుల మేలు కొరకు శ్రమ త్యాగధనుల
కాయకష్ట ఫలముగ- నిష్కామ కర్మ ఫలితముగా
స్వచ్చ – సంస్కృతీ వైభవ సత్ఫలితాలివిగొ రెండు-
ఒకటి-వీధి పరిశుభ్రం, రెండు- గ్రామ సౌందర్యం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
14.05.2026