3834* వ రోజు....           15-May-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

నిన్నటి చోటనే 3834* వ శ్రమదానం!

               శుక్రవారపు (15.5.26) NH-216 వ రహదారి క్రమబద్ధీకరణ కోసం మళ్లీ అదే 4.21 వేకువ సంసిద్ధులై నిలిచిన 14 మంది, కొన్ని నిముషాల్లో చేరుకున్న 18 మందీ, వెరసి నిన్నటికన్న ఒక్కరు తక్కువగా కాసానగర చెక్ పోస్టు కూడలి ప్రాంతాన నెరవేర్చిన బాధ్యతలిలా ఉన్నవి!

1) కాసానగర్ వైపున్న రహదారి మార్జిన్లోని గడ్డీ, పిచ్చిమొక్కలూ, ఇతర తుక్కులూ ఐదారుగురు ఎంచుకొన్నారు.

2) రహదారి దక్షిణపు దిక్కున పడివున్న ముళ్ళ కొమ్మలూ, ప్రహరీకి లోపలా, వెలుపలా పెరిగిన గడ్డీ కత్తుల వారు శుభ్రపరిచారు.

3) ఉపాధ్యాయలూ, ముగ్గురు విశ్రాంత ఉద్యోగులూ చెకపోస్టు నుండి తూర్పుగా ఎండు గడ్డి పరకలూ, పుల్లలూ, పెరుగుతున్న పచ్చికా, ఊడ్చగా, మరో నలుగురు ఏటవాలు ఉత్తరపు భాగాన్ని క్షుణంగా - అద్దంలా మెరుగుపరచారు.

4) డివైడర్లలో పూల మొక్కల పాదుల్లో పెరుగుతున్న గడ్డి సంగతిని మరికొందరు చూచుకొన్నారు!

5) ప్లాస్టిక్ సూక్ష్మ - స్థూల సింగిల్ యూజ్ వస్తువుల్నీ, కాగితమ్ముక్కల్నీ షణ్ముఖ - వేముల శ్రీనివాస్ ఒక గోతానికెత్తి, చెత్తబండిలో వేస్తే –

6) 6:05 కల్లా ఐదారుగురు చకచకా అందించిన డిప్పల వ్యర్థాలను ఒక విద్యార్థిని చక్కబెట్టింది.

               నేనేదో కావాలని పనుల్ని విడుదీసి వ్రాస్తున్నాను గాని - కొందరు కార్యకర్తలు అన్నిరకాల - అన్ని చోట్ల పనులకూ పనులకూ రెడీగానే ఉంటారు!

               ఫలానా చెత్త పని అనే నియమేం పెట్టుకోరు!

               ఒకరికిద్దరు - ఒకమారు కాదు - రెండు మార్లు క్రొత్త సిమెంటు రోడ్డును తడిపారు.

               చివరికందరూ డివైడర్ పడమర రోడ్డు భాగం మీద నిలిచి, సీతారామయ్య గారు పలికిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలకు వంతపాడారు.

               అప్పుడిక DRK గారు నిన్న మనకోసం మనం ట్రస్టుకు జనవిజ్ఞాన వేదిక వారందించిన 1,20,000/- విరాళాన్ని ప్రస్తావించి,

               రేపటి శ్రమదాన ప్రదేశం కూడ ఈ NH 216 - కాసానగర చెక్ పోస్టు నుండే జరుగునని ప్రకటించారు!

               మఘన పుట్టి పుబ్బలోన

అల్లా టప్పా ఉద్యమ మని భావించుటతప్పని-

మఘన పుట్టి పుబ్బలోన మాయమయే దిది కాదని-

ప్లాస్టిక్ భూతం నశించి, స్వచ్చ- శుభ్ర సుందరమై

చల్లపల్లి మెరయు వరకు సాగును ఇదియని నమ్మడు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   15.05.2026