3835* వ రోజు....           16-May-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

3835 * వ పర్యాయం...!

               అది శనివారం (16.05.2026) కావడంతో కార్యకర్తల సంఖ్యా బలం పెరిగి, 39 కి చేరింది. ఈ వేకువ కూడ అదే NH-216 రహదారి సుందరీకరణమే!  కాకపోతే అటు కప్తానుపాలెం వైపు గానూ, ఇటు కళ్లేపల్లి బాట దిశగానూ పనుల విస్తరణ  జరిగింది.

               అదనపు కార్యకర్తలు - ముఖ్యంగా సుందరీకర్తలు పెరగడంతో కొన్ని పనుల నాణ్యత పెరిగింది. ఇటీవలి 6-7 రోజుల ప్రయత్నంతోనే ఆ ప్రాంతం నాలాంటి వాళ్లకు శుభ్ర-సుందరంగా కనిపించింది గాని, కొందరు కార్యకర్తలకది చాలలేదు ! ఎక్కడ చిన్న కాగితమ్ముక్కా, ఎండుపుల్లా, డివైడర్ల మొక్కల మధ్య కలుపు మొక్కా కనిపించినా వాళ్ళ మనసు చివుక్కుమంటుంది.

               అందువల్ల ఈ కార్యకర్తల్లో సగం మంది పనుల్లో రాశికన్నవాశే ప్రధానం. ఈ వేకువ పనులు వాళ్ళకంత సంతృప్తిగా ఉన్నా దక్షిణపు గోడ నిండా రకరకాల కాగితపు పోస్టర్లు వాళ్ళకు నచ్చడం లేదు. వాటి పైన రంగుల చిత్రలేఖనాలు వ్రాయాలని వాళ్ళ కోరిక.

               నేటి శ్రమలో సింహభాగం చెక్ పోస్టుకు తూర్పుగా పూల మొక్కల, అక్కడి డ్రైన్ల వాలులో పిచ్చి మొక్కల పనులే! సగం మంది శ్రమించింది ఆ 30 గజాల రహదారి మార్జిన్ లోనే! గంటన్నరకుపైగా వాళ్ల చెమట చిందిస్తున్నప్పుడు మధ్యేమధ్యే పల్నాటి అన్నపూర్ణమ్మ పానీయం సమర్పయామి! 

               ఇలా 3 చోట్ల – మూడు రకాల రహదారి బాధ్యతలు తీరుతున్నప్పుడు – రకరకాల శ్రమ సౌందర్య సందర్శనకూ, అవగాహనా సంప్రదింపులకూ DRK డాక్టరు గారు కార్యకర్తల భద్రతా హెచ్చరికలు చేస్తూ తిరుగుతుంటారు, అరుదైన ఆ శ్రమ దృశ్య భంగిమల్ని తూము వారు ఫోన్ కెమేరాలో బంధిస్తుంటారు, అటూ ఇటూ ప్రయాణికులేమో ఇదంతా అర్థం కాక చూస్తూ వెళుతుంటారు!

               మరీ ఆలస్యం కాకుండా, 6.05 కే పనులు ముగించిన కార్యకర్తలు చల్లపల్లి – NH 216 జంక్షన్ లో నిలబడి 7 వ తరగతి చదవబోతున్న హారిక శ్రావ్యంగా వినిపించిన శ్రమదానోద్యమ ప్రతిజ్ఞల్ని ఆమోదించి,

               గతంలో లాగా ఉప్పు వాడకంలో కటిక నిబం ధనలిప్పుడక్కరలేదనీ, రుచి కోసం తగు మాత్రం వాడుకోవచ్చుననీ ప్రకటించి,

               రేపటి వేకువ కూడ ఇదే NH 216- కాసానగర్ చెక్ పోస్టుల వద్దే కలవాలనీ DRK గారు నిర్దేశించి, అన్నపూర్ణ గారి 950/- స్వీకరించి,

               నేటి శ్రమను ముగించారు!

               ఆశావహ భవితవ్యం!   

కొందరికైనా ఉన్నది సొంతూరి పట్ల మమకారం

కొందరిలో రోజుకొక్క గంట పాటు శ్రమ త్యాగం

ఇంకొందరైన ఊరి కొరకు కొంతయినా ధన త్యాగం

అదె మరి శ్రమదానోద్యమ ఆశావహ భవితవ్యం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   16.05.2026