పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
ఆదివారం (17.5.26)శ్రమ వేడుక కదా మరి ! @ 3836*
48 మంది - అందులోనూ 5 గురు క్రొత్తవారితో గొల్లపల్లి సునీల్ బాబు- వాలంటరీలీ రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ , 2) కమ్యునిష్టు వీధి యువకుడు చందు, 3) విన్నకోట వెంకటేశ్వర రావు
కాసానగర్ చెక్ పోస్టు కేంద్రంగానూ, పాగోలు రోడ్డులోనూ జరిగిన శ్రమ సమర్పణల విధం బెట్టిదనగా:
- కాసానగర్ హద్దుగా బొందలపాటి, మల్లంపాటి, పల్నాటి, సజ్జా వారలు పాతిక గజాల బారునా హైవే మార్జిన్లో నూ,
- చెక్ పోస్టు తూర్పుగా ప్రమాద హెచ్చరిక సంకేతంగా విరిగిన ప్రాత కారున్న చోటు దాకా మెండు, కస్తూరి, జాస్తి తదితరులు,
- డివైడర్ల శుభ్ర సుందరీకరణ, గడ్డి మొలకల సమూల నిర్మూలనలో మరో ముగ్గురున్నూ,
- బ్రహ్మం గారి మఠం ఉత్తరాన పాగోలు బాటలో వాహన చోదకుల భద్రతా నిమిత్తం ఆకుల- భోగాది – తరిగోపుల-దేసు కార్యకర్తల చెట్ల కొమ్మల తొలగింపులున్నూ,
- ఇక అసలైన పాతిక మంది శ్రమ సమర్పణ NH 216 ఉత్తరపు మార్జిన్ నుండి పొలం దాకనూ గమనించాను.
అడపా, అనిల్ వంటి గురువులు ధారలుగా కార్చిన చెమటను చూశాను. పల్నాటి భాస్కరుని మొదలు సీతారామయ్య, హారికల దాక ఇలా వేకువ సమయపు బరువు పనులకు మూడేసి నాల్గేసి కిలో మీటర్లు ప్రయాణించి వచ్చి ఇంత క్రమ శిక్షణగా పని చేయడమేమిటా అని ఆశ్చర్య పోయాను!
మరి- నాకే ఇంత ఆశ్చర్యానందకరంగా ఉంటే - క్రొత్తగా వచ్చి, ఈ డర్టీ బాధ్యతల్ని చూసిన సునీల్ బాబు వంటి వాళ్ళకి?
6.25 కు అందరి సమక్షంలో ఆయన మాటల్లోనే అది తెలిసిపోయింది.
ఇంకా ఆ సమావేశంలో:
డి. ఆర్.కె. గారి ఆరోగ్య ఆహార ప్రస్తావనా, తీపి వస్తువుల ప్రమాద హెచ్చరికా, నందేటి శ్రీను ఆలపించిన స్వీయ పద్యమూ,
ముఖ్యంగా రామా యాక్స్ టైలర్స్ వారి 50 గుడ్డ సంచుల పంపకమూ,
రేపటి వేకువ సేవలకు కూడ ఇదే NH 216 లోని కాసానగర్ వద్దకు ఆహ్వానమూ... కొన్ని ముఖ్యాంశాలు!
జీవం మనుగడె కష్టం!
ప్రతి ఒకరు కిలోల కొద్ది ప్లాస్టిక్ వాడి పారేస్తే
రీ సైక్లింగ్ మాట మరచి రోడ్లపైన వదిలేస్తే
భూమిలోన కరగవు మరి భూగోళం ఏమవాలి!
జీవం మనుగడె కష్టం! చేజేతుల వినాశనం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
17.05.2026